ఎన్నికల వేళ…పాక్ లో విజృంభించిన ఉగ్రవాదులు…134 మంది మృతి

పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రక్రియ రక్తసిక్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు శుక్రవారం రెండుచోట్ల శక్తిమంతమైన బాంబులను పేల్చారు. ఇందులో 134 మంది మరణించారు. సుమారు 160 మంది వరకు గాయపడ్డారు. బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని మస్తుంగ్‌ ప్రాంతంలో  జాతీయవాద బలూచిస్థాన్‌ అవామీ పార్టీ (బీఏపీ) ఎన్నికల సభలో ఆ పార్టీ నేత సిరాజ్‌ రైసానీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు పేల్చారు. ఆయన బలూచిస్థాన్‌ మాజీ సీఎం నవాబ్‌ అస్లామ్‌ రైసానాకు సోదరుడు.  తీవ్రంగా గాయపడిన సిరాజ్‌ను క్వెట్టాలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. తొలుత మృతుల సంఖ్య తక్కువనే ఉంది. ఆ తర్వాత క్షతగాత్రుల్లో అనేక మంది ఆసుపత్రుల్లో కన్నుమూశారు. ఈ దాడి కోసం 16-20 కిలోల వరకూ పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఈ ఘటన నేపథ్యంలో క్వెట్టా ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. అదనపు వైద్య సిబ్బందిని విధుల్లో పిలిపించారు. అంతకు కొన్ని గంటల ముందు ఖైబర్‌ పక్తుంఖ్వా రాష్ట్రంలోని బన్ను ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి, ముత్తహిద మజ్లిస్‌ అమాల్‌ (ఎంఎంఏ) కూటమి అభ్యర్థి అక్రమ్‌ ఖాన్‌ దుర్రానీని లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చారు. ఐదుగురు చనిపోగా, 37 మంది గాయపడ్డారు. దుర్రానీ క్షేమంగా బయటపడ్డారు. ఆయన వాహనం బాగా దెబ్బతింది. ఈ నెల 25న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన.. బన్ను నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడి, తన ప్రచారాన్ని ఆపబోనని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల సందర్భంగా దేశంలో అకస్మాత్తుగా శాంతి భద్రతలు క్షీణించాయి. పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి. సోమవారం పెషావర్‌లో జరిగిన ఎన్నికల సభపై జరిగిన ఆత్మాహుతి దాడిలో అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) నేత, అభ్యర్థి సహా 21 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates