ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ : జూలైలోనే పంచాయతి సమరం

GP ELECTIONSగ్రామ పంచాయతి ఎన్నికలపై  రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూలై చివరినాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తోంది. అన్ని జిల్లాల్లో ఏర్పాట్ల కోసం బుధవారం (మే-30) హోటల్ మారియట్ లో సీఎస్ ఎస్కేజోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయితి రాజ్ శాఖ అధికారుల తో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. పంచాయతీల్లో ఖరారు చేసిన రిజర్వేషన్ల జాబితా ఇవ్వగానే.. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 12వేల 734 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కోటి 50లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారని చెప్పారు.

ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా పైనల్ అయిందని చెప్పారు నాగిరెడ్డి. ప్రింటింగ్ అంతా జూన్ 15 నాటికి పూర్తి అవుతుందనీ,  బ్యాలెట్ ప్రిటింగ్ అంతా జిల్లాలోనే పూర్తి చేయాలని కలెక్టర్లకు చెప్పారు. పెద్ద జిల్లాల్లో మూడు విడతలు, చిన్న జిల్లాల్లో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జులై నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికలు ముగించి.. ఆగస్టులో కొత్త పాలకవర్గాలకు పదవీ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు నాగిరెడ్డి.

Posted in Uncategorized

Latest Updates