ఎన్నికల సంస్కర్త… టీఎన్ శేషన్ గురించి తెలుసుకోండి

టిఎన్.శేషన్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా భారత ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి.  ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. 1989లో సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్‌గా శేషన్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు.. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారాలు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి శేషనే. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది శేషన్ సీఈసీ గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు సాహసం చేయలేకపోయారు.

ఎన్నికల నిర్వహణ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు ఆయన అనేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకున్న ఆయన ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి లిమిట్ ను ఫిక్స్ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ సిబ్బందిని అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించిన శేషన్.. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదనే రూల్ ను ఆయన గట్టిగా అమలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ప్రజలకు బాగా తెలిసింది శేషన్ వచ్చిన తర్వాతేనని చెప్పొచ్చు. శేషన్ అందించిన సేవలకుగాను 1996లో ఆయన్ని ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates