ఎమ్మార్పీకే విక్రయించాలి : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో ఆగస్టు 1 నుంచి ఎమ్మార్పీకి మాత్రమే అన్ని రకాల ప్రొడక్టులను విక్రయించాలని, ఈ విషయంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ విభాగం కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. ఎమ్మార్పీపై అదనంగా వసూలు చేసినట్టు తెలిస్తే, భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని అన్నారు. నీళ్ల బాటిల్స్ అమ్మేవారు, వివిధ రకాల బ్రాండ్ లను తప్పనిసరిగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచి, వారికి నచ్చిన బాటిల్ కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్యాకేజ్డ్ ప్రొడక్టు ఏదైనా ఎమ్మార్పీపై మాత్రమే అమ్మాలని తెలిపారు.

కాగా, ఇటీవలి కాలంలో సినిమా హాల్స్, మల్టీప్లెక్స్ లలో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మల్టీప్లెక్స్ లలో అమ్మే ప్యాకింగ్ లేని ఫుడ్… అంటే పాప్ కార్న్, శీతల పానీయాలు తదితరాలను అందించే కంటెయినర్లపై ఎంత బరువు? ధర ఎంత? తదితర విషయాలు తప్పనిసరిగా ముద్రించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు.

ధరల సూచికలు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలన్నారు అధికారులు. ధరలు మారినప్పుడు.. మార్పులు, చేర్పులు చేయాలన్నారు. ఒకే బ్రాండ్‌ ఐటమ్స్‌ కాకుండా పలురకాలు అందుబాటులో ఉంచాలన్నారు. చట్టం ప్రకారం ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు వంటి వివరాలు ఉండాలని సూచించారు.

4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీల్లో గ్రేటర్‌ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోనూ, 4, 5 తేదీల్లో రాష్ర్ట వ్యాప్తంగానూ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి 25 వేల రూపాయలు ఫైన్, రెండోసారి 50 వేల రూపాయల ఫైన్, మూడోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు 6 నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates