ఎర్రటి చంద్రుడు.. సుదీర్ఘ చంద్రగ్రహణం : అర్ధరాత్రి కనువిందు చేసిన అద్భుతం

శుక్రవారం (జూలై-27) రాత్రి ఆకాశంలో అద్భుతం కనువిందు చేసింది. ఒకేరోజు.. సుదీర్ఘ చంద్రగ్రహణం… ఎర్రటి చంద్రుడు… రెండు అద్భుతాలు జరిగాయి. చంద్రగ్రహణం తర్వాత.. చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోయాడు. 103 నిమిషాల పాటు రెడ్ మూన్ ఆకట్టుకున్నాడు. సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడింది. భూమి వాతావరణం పైనుంచి వెళ్లే కాంతి కారణంగా చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోయాడు.

అంగారకుడు భూమికి దగ్గరగా రావడం.. ఈ చంద్రగ్రహణం మరో ప్రత్యేకత. గ్రహణం మన దేశంలో  నిన్న రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలై.. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 59 నిమిషాలకు ముగిసింది. రాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల 43 గంటల మధ్య చంద్రగ్రహణం పరిపూర్ణంగా కనిపించింది. ఈ సమయంలోనే బ్లడ్ మూన్ కనువిందు చేసింది.

హైదరాబాద్ లో ఆకాశం మబ్బులు పట్టి ఉండటంతో బ్లడ్ మూన్ ఎక్కువగా కనిపించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఎర్రని చంద్రుడు అలరించాడు. రెడ్ మూన్ చూస్తూ రాత్రంతా జనం రోడ్లపై జాగారం చేశారు. ప్లానెటోరియాల దగ్గర టెలిస్కోప్ లు పెట్టి చూపించడంతో.. పిల్లలు, యువత ఎంజాయ్ చేశారు.

గ్రహణ సమయం పూర్తి కాగానే ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి తలుపులు తీశారు. తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు. ఉత్తరాదిన గంగా, ప్రయాగ, వారణాసి ప్రాంతాల్లో నదీ జలాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. గ్రహణంపై మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు కొందరు సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates