ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ : ఆగస్టు 15న మెట్రో పరుగు

ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు పంద్రాగస్టున మరో మార్గంలో పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.  ఇక అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో అక్టోబర్‌లో, ఎంజీబీఎస్‌–జేబీఎస్‌ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు నడుస్తాయని చెపుతున్నారు మెట్రో వర్గాలు. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

మెట్రో రైళ్ల రాకపోకల కోసం 8 రైల్వే ఓవర్‌ బ్రిడ్జీల(ద.మ.రైల్వే పట్టాలపైన ఏర్పాటు చేసినవి) నిర్మాణం పూర్తవడంతో మూడు మార్గాల్లో మెట్రో పరుగుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. అత్యంత కీలకమైన బోయిగూడా ఆర్‌వోబీ నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. ఈ ఆర్‌వోబీ నిర్మాణంతో జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులకు మార్గం సుగమమైంది. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ప్రత్యేక పరిస్థితులు, వినూత్న డిజైన్లతో బోయిగాడా వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఉక్కు ప్లేట్లను అధిక కచ్చితత్వంతో ఒకదానితో మరోటి జత చేశారు. ఇందుకోసం ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే నైపుణ్యంగల సిబ్బందిని నియమించారు. వంతెన నిర్మాణానికి పరిమిత స్థలంలో అధిక సామర్థ్యం ఉన్న క్రేన్లను చాకచక్యంగా ముందుకు కదిల్చారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఏర్పాటు చేసిన ఆరు వరుసల ద.మ.రైల్వే పట్టాలపైన ఈ ఉక్కు వంతెనను నిర్మించారు.

బోయిగూడా వంతెన …

స్టీలు వారధి పొడవు                                           :     221 అడుగులు
స్టీలు వారధి వెడల్పు                                          :     64 అడుగులు
వంతెన పిల్లర్ల ఎత్తు                                             :     1,417 అడుగులు
ద.మ.రైల్వే పట్టాల పైనుంచి బ్రిడ్జీ ఎత్తు                    :   30 అడుగులు
వంతెనను కదిల్చేందుకు వాడిన జాక్‌ల బరువు       :   ఒక్కోటి వంద టన్నులు
వర్టికల్‌ లిప్టింగ్‌ జాక్‌ బరువు                                 :     300500 టన్నులు
మొత్తం వారధి బరువు                                      :    960 మెట్రిక్‌ టన్నులు

Posted in Uncategorized

Latest Updates