ఎవడీ దేవరాజ్ : గుట్టలుగా కరక్కాయపొడి.. బాధితులు గగ్గోలు

హైదరాబాద్ KPHBలోని సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కరక్కయల వ్యాపారం పేరుతో ప్రజలకు రూ.5కోట్లు ముంచేసింది. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ ద్వారా నష్టపోయిన వారందరూ కూడా మధ్య, దిగువ తరగతి ప్రజలే. ఒక్కొక్కరూ లక్ష నుంచి అత్యధికంగా 40 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. క్వింటాళ్ల కొద్దీ కరక్కాయలు కొనుగోలు చేసి.. వాటిని పొడి చేసి పెట్టుకున్నారు. డబ్బుులు చెల్లించాల్సిన సమయంలో బోర్డు తిప్పేయటంతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో గోడు వెళ్లబోసుకుంటున్నారు బాధితులు.

ఈ దందా వెనక మాస్టర్‌ మైండ్‌ నెల్లూరుకి చెందిన అనిల్‌ దేవరాజ్‌. ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. అతని బ్యాంక్ అకౌంట్లు పరిశీలిస్తున్నారు. అయితే దేవరాజ్ ఆధార్, పాన్ నెంబర్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి.. లావాదేవీలు నడిపినట్లు తెలుస్తోంది. ఈ మోసంలో మరో కీలక సూత్రధారి మేనేజర్‌ మల్లికార్జున్‌. అతని వెనక ఉండి.. అసలు కథంతా నడిపింది దేవరాజ్ అని పోలీసులు నిర్థారణకు వచ్చారు. పేపర్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాడు. కరక్కాయల వ్యాపారం పేరుతో యాడ్స్ వచ్చినా.. ఇప్పటిదాకా దేవరాజ్‌ కు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదంటే.. ఎంత పకడ్బంధీగా ఈ దోపిడీకి స్కెచ్ వేశాడో అర్థం అవుతుంది.

2018 మార్చి నెలలో.. KPHB కాలనీలోని రోడ్‌ నంబర్‌-1 SBI బ్యాంకులో కరెంట్‌ ఖాతా తెరిచిన దేవరాజ్‌.. తన ఫొటో, ఆధార్‌ నంబరు ఇవ్వకపోవడం విశేషం. దీంతో ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంస్థ బోర్డు తిప్పేయడానికి వారం ముందు వరకు బ్యాంకులో లక్షల్లో లావాదేవీలు జరిగాయి.

కేసులో సూత్రధారులు దేవరాజ్, మల్లిఖార్జున్ లను పట్టుకోవటానికి DCP వెంకటేశ్వరావు, ACP భుజంగరావు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ కూడా ఈ కేసును ఛేదించే పనిలో ఉంది. ఇన్‌ స్పెక్టర్‌ గోపానాథ్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. బాధితులు అందరూ కూడా మధ్య, దిగువ తరగతి వారు కావటంతో.. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి కరక్కాయల వ్యాపారంలో పెట్టుబడి పెట్టంతో ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీలైనంత త్వరగా కేసును కొలిక్కి తీసుకొచ్చి.. బాధితులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates