ఎవరి సొమ్ము.. ఎవరు అమ్ముతారు? : తెలంగాణలో ఆస్తుల అమ్మకానికి ఏపీ కమిటీ

film tvరాష్ట్ర విభజన తర్వాత అమరావతి వెళ్లిపోయిన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు కొత్త వాదనకు తెరలేపింది. తెలంగాణలోని ఆస్తులను పదేళ్లు అనుభవించటానికి మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడి ఆస్తులు ఇక్కడే ఉంటాయని చట్టం చెబుతోంది. అయితే.. తెలంగాణలోని ఆస్తుల అమ్మకానికి చంద్రబాబు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయటం వివాదంగా మారింది. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోందంటున్నారు తెలంగాణ అధికారులు.

హైదరాబాద్ ఏసీ ఘాట్స్ లో ఉన్న ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ ఆర్ట్స్ అభివృద్ధి సంస్థ బిల్డింగ్ లో ఏపీ వాటా ఉంది. విభజన సమయంలో ఇచ్చారు. ఇది కేవలం అనుభవించటానికి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ 9 సంస్థ ఇది. చట్టంకి విరుద్ధంగా తమ వాటా అమ్మకానికి కాలు దువ్వుతున్నది చంద్రబాబు సర్కార్. బిల్డింగ్ లోని ఏపీ వాటా విక్రయానికి 8 మంది సభ్యులతో కమిటీ వేస్తూ జీవో జారీ చేసింది. ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, న్యాయశాఖ కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు.

దీనిపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థ అని, ఇంకా విభజన కాని, ఏపీ భూభాగంలో లేని భవనాన్ని ఎలా అమ్మకానికి పెడతారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర భూభాగంలోకి వచ్చి బిల్డింగ్ అమ్మకానికి ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇది కయ్యానికి కాలుదువ్వటమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు. గిల్లికజ్జాలతో గొడవలకి దిగటం భావ్యం కాదని సూచిస్తున్నారు. ఇది ఏకపక్ష నిర్ణయం అంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని.. షెడ్యూల్ 9లోని ఆస్తుల పంపకాలు పూర్తి కాకుండానే ఏపీ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుదని నిలదీస్తోంది తెలంగాణ సర్కార్. దీనిపై కేంద్ర హోంశాఖకి కంప్లయింట్ చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో దీనిపై నిలదీస్తామని చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates