ఎవరైనా పట్టించుకోండి : మంచిర్యాల జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

మంచిర్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కుటుంబాలు కుటుంబాలే …మంచాల బారినపడ్డారు. ప్రభుత్వ వైద్యం అందక, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వేలకు వేలు పెట్టి ట్రీట్ మెంట్ చేయించుకోలేక.. ఇంటిదగ్గరే ఉంటున్నారు. నిస్సహాయ స్థితిలో జ్వరాలతో పోరాడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ద్య లోపంతో మురుగునీరు చేరడం, ఆ నీరు తాగి జ్వరాలు తెచ్చుకుంటున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా లాంటి జ్వరాలతో బాధపడుతున్నారు. కన్నెపల్లి మండలంలో సగం మంది …. జ్వరాలతోనే బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కన్నెపల్లి, నెన్నెల, భీమిని, వేమనపల్లి, కోటపల్లి, బీమారం, కాసేపేట, బెల్లంపల్లి, తాండూరు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సమస్యలు.. స్థానికులను రోగాల పాల్జేస్తున్నాయి. గతేడాది కన్నెపల్లి అభివృద్దికి 1 కోటి 10లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ రాజకీయ కారణాలతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆ డబ్బులు ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ఆ డబ్బులను కనుక ఖర్చుచేసి మురుగుకాల్వలు, రోడ్లు, మంచినీటి బావిని బాగుచేయడం కోసం ఉపయోగిస్తే కన్నెపల్లి లో పరిస్తితి మెరుగ్గా ఉండేది. ఇక్కడ డెంగ్యూ సోకి.. పదిరోజుల వ్యవధిలో నలుగురు చనిపోయారు.
రోగాలు, రొప్పుల పాలై ఏడుస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు స్థానికులు. రోడ్లులేక.. మురికినీరు పోక.. జ్వరమొస్తే దవాఖాన్లో చూపించుకోలేక నరకయాతన పడుతున్నామంటున్నారు. ఇన్నిరోగాలు ఎందుకొస్తున్నాయో స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియదా అని నిలదీస్తున్నారు.
జ్వరం వచ్చిందంటే చాలు జనాలు గజగజ వణికి పోతున్నారు. అప్పులు చేసి ఆరోగ్యం కాపాడు కోవాల్సిన దుస్థితి ఇక్కడి వాళ్లది. ఈ పల్లెటూళ్లలో ప్రభుత్వ వైద్యం సమయానికి అందడం లేదు. మెడికల్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ టెస్ట్ లు చేసి తాత్కాలికంగా టాబ్లెట్లు ఇస్తున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల ప్రభుత్వ దవాఖానాలకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ సరైన వైద్యం అందక… ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్లుల దోపిడీకి తట్టుకోలేక.. ఇళ్లలోనే రోగాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates