ఎవరైనా పెట్టుకోవచ్చు : వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లకు లైసెన్స్ లేదు

e-chargingఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రాయితీలు ఇస్తున్న కేంద్రం.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లకు ఎలాంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ యాక్ట్ ప్రకారం.. విద్యుత్‌ను వినియోగదారుడికి విక్రయించే ట్రాన్స్‌మిషన్లు, డిస్ట్రిబ్యూషన్లు, ట్రేడింగ్ నిర్వహించే సంస్థలు కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-వాహన చార్జింగ్ స్టేషన్లు ఈ మూడింటితో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో.. లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ.

ఇది చాలా కీలక నిర్ణయమని.. మరిన్ని విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు విద్యుత్ వాహనాల తయారీ సంఘం(ఎస్‌ఎంఈవీ) కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ సోహిందర్ గిల్. ఇందుకు సంబంధించి భూ సేకరణ, ప్రోత్సహకాలపై దృష్టి సారించాలని కేంద్రానికి సూచించారు. ఈ-వాహనాలపై త్వరలో ప్రత్యేక పాలసీని ప్రకటించనున్నట్లు గత నెలలోనే వెల్లడించింది విద్యుత్ శాఖ. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంక్ మాదిరిగా.. ఈ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లకు లైసెన్స్ అవసరం లేదు.. ఎవరైనా పెట్టుకోవచ్చు. ధరల విషయంలో మాత్రం ఇంకా స్పష్టం రాలేదు. మరికొన్ని రోజుల్లో ఛార్జింగ్ ధరలపై ఓ ప్రకటన రావొచ్చు.

Posted in Uncategorized

Latest Updates