ఎస్‌బీఐ ఖాతాదారులకు ఏటీఎం నుంచి రూ.20 వేలే

తమ ఖాతాదారులకు నెలాఖరు (అక్టోబరు 31 అర్థరాత్రి) నుంచి రోజుకు రూ.20 వేలే పరిమితం చేసింది స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ). క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నబ్యాంక్‌ ఖాతాదారులు ఇప్పుడు రోజుకు రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే వీలుంది. ఈ నెలాఖరు (అక్టోబరు 31 అర్థరాత్రి) నుంచి ఈ పరిమితిని రూ.20 వేలకు కుదించింది ఎస్‌బీఐ. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరగడంతోపాటు నగదురహిత/ డిజిటల్‌ లావాదేవీలు పెంచడమే ధ్యేయంగా బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుందని చెపుతున్నారు ఆ బ్యాంకు అధికారులు. బ్యాంకింగ్‌ నిబంధనల ప్రకారం కార్డుపై నగదు ఉపసంహరణ పరిమితిలో మార్పులు చేస్తే 30 రోజుల ముందుగా బ్యాంకులు తమ ఖాతాదార్లకు తెలియజేయాలి. అందువల్ల బ్యాంక్‌ శాఖలకు కూడా ఈ విషయమై సమాచారం పంపినట్లు వెల్లడించారు. ఇంతకన్నా అధిక మొత్తం నగదు రోజువారీ ఉపసంహరించాలంటే, అందుకనువైన కార్డు కోసం ఖాతాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ కార్డులు అధికంగా వాడేది ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులే. అత్యధిక మంది రోజువారీ రూ.20 వేలు మించి తీయడం లేదని బ్యాంకు పరిశీలనలో తేలింది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి ఉపసంహరిస్తున్నారు. సరకు అందుకున్న వ్యాపారి అందుకు సంబంధించిన మొత్తాన్ని సరకు పంపిన వ్యాపారి ఖాతాలో వేస్తున్నారు. ఇలాంటివారు భారీగా విత్‌డ్రా చేస్తున్నారు. కరెంటు ఖాతా వాడకుండా, ఈ రూపేణా చేయడాన్ని బార్టింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి లావాదేవీలను గుర్తించినందునే, ఈలాంటి కఠిన చర్యలు బ్యాంక్‌ తీసుకుందంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates