ఏం జరిగింది : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి మృతి

SANATHNAGAR PS DEATHహైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగతనం కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో ఆ వ్యక్తిని లాకప్ లో పోలీసులు కఠినంగా కొట్టడంతోనే చనిపోయాడని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం (మే-30) సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో జరిగింది.

గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా..  వారు కొట్టిన దెబ్బలతోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవున్నాయి.  రామంతాపూర్‌ కు చెందిన  కూలీ ప్రేమ్‌ చంద్‌ (37)ను ఎర్రగడ్డ బజాజ్‌ ఆటో ఫైనాన్స్‌  ఏజెంట్లు వాహనాలు, EMI ల రికవరీ కోసం తీసుకుని వెళుతుంటారు. ఈ క్రమంలోనే వారం క్రితం ఓ ఏజెంట్‌ రికవరీ అయిన రూ.2లక్షలను బజాజ్‌ ఆఫీసులో చెల్లించాల్సిందిగా ప్రేమ్‌ చంద్‌ కు ఇచ్చాడు. ప్రేమ్‌ చంద్‌ ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డబ్బు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం(మే-29) పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా.. అక్కడ డబ్బు దొరకలేదు.

అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలోనే నిందితుడు గుండెపోటుతో మరణించాడని తెలిపారు పోలీసులు. ఈ ఘటన బుధవారం(మే-30) వెలుగులోకి వచ్చింది.   అయితే నగదు రికవరీ కోసం పోలీసులు ప్రేమ్‌ చంద్‌ పై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించడం వల్లే మరణించి ఉండొచ్చని, అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు ఉన్నతాధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates