ఏడేళ్లు జైలు శిక్ష : లంచం ఇచ్చినా..తీసుకున్నా నేరమే

లంచం ఇస్తూ అడ్డదారిగా పనులు చేయించుకోవాలనుకునేవారికి ఇక పప్పులు ఉడకవు. ఇప్పటివరకు లంచం తీసుకునేవారే నేరస్తులుగా శిక్షార్హులు. అయితే ఇకనుంచి లంచం ఇచ్చినవారిని కూడా చిప్పకూడు తప్పదు. దీనిపై అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం (జూలై-24) సభలో ప్రవేశపెట్టారు. లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు.

Posted in Uncategorized

Latest Updates