ఏపీకి మోడీ మోసం చేశారు : గల్లా

ఏపీకి ప్రధాని మోడీ తీరని లోటు చేశారన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ప్యాకేజీ విషయంలో మ్యానిపెస్టోలో మాటఇచ్చిన మోడీ మొండిచేయి చూపించారన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ చర్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వివక్షకు గురవుతుందన్నారు. లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం (జూలై-20) జయదేవ్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ కాదు అని చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామని, స్పెషల్ ప్యాకేజీ.. ప్రత్యేక హోదాకు సమానంగా ఉంటుందన్నారు. అయితే మోడీ ఏమీ ఇవ్వలేదన్నారు. రాజ్యాంగంలోని 4వ ఆర్టికల్ ప్రకారం తమను న్యాయం చేయాలని జయదేవ్ డిమాండ్ చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అన్యాయం చేశార‌న్నారు. ఆంధ్ర నుంచి 2.35 ల‌క్ష‌ల కోట్ల ప‌న్ను వ‌సూల్ చేశార‌ని, అయితే రాష్ట్రానికి త‌క్కువ ఇచ్చార‌న్నారు జ‌య‌దేవ్. విభజన జరిగినప్పటి నుంచి ఏపీ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు.

విభజన జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఉందన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వలేదు.. హామీలు నెరవేర్చలేదన్నారు. ఇదే సభలో విభజన బిల్లు ఎలా ఆమోదించారో ప్రతి ఒక్కరికి తెలుసు అని జయదేవ్ అన్నారు. రూ. 16 వేల కోట్ల కనీస రెవెన్యూ లోటును కూడా పూడ్చుకోలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. రూ. 24 వేల కోట్ల లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉందన్నారు జయదేవ్. విభజనతో ఏపీ భారీగా నష్టపోయింది. ఆదాయ వనరులను కూడా కోల్పోయిందన్నారు. విభజన పాపంలో బీజేపీది కూడా సగం ఉందన్నారు. ఏపీ పునర్విభజన బిల్లు పాస్ కావడంలో కాంగ్రెస్‌ తో సమానమైన బాధ్యత బీజేపీకి ఉందని జయదేవ్ తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ కు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు ఎంపీ గల్లా జయదేవ్.

Posted in Uncategorized

Latest Updates