ఏబీ సంచలన నిర్ణయం : క్రికెట్ కు గుడ్ బై

ABDవిధ్వంసకవీరుడు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. బుధవారం (మే-23) తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నానని.. 114 టెస్టులు, 228 వన్డేలు ఆడినట్లు చెప్పాడు. యువకులు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్న ఏబీ.. తాను చాలా అలసిపోయానన్నాడు.

ఇది చాలా కఠిన నిర్ణయమని.. చాలా రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. మంచి ఫామ్‌ లో ఉన్నపుడే తప్పుకోవాలని అనుకున్నట్లు వివరించిన ఏబీ..ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌ కు ఇదే సరైన సమయమని భావించినట్లు చెప్పాడు. 14 ఏళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌ లు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్‌ కు కృతజ్ఞతలు తెలిపాడు. టీమ్ మేట్స్‌ కు చాలా పెద్ద థ్యాంక్స్ అని… వాళ్ల మద్దతు లేకుండా ఈ స్థాయికి వచ్చేవాడినే కాదన్నాడు. సంపాదించడం పక్కనపెడితే బాగా అలసిపోయానని.. ఇక నావల్ల కాదు అనిపించిందన్నాడు. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలని.. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా లేదన్నాడు. అయితే దేశీయంగా టైటన్స్ టీమ్‌ కు మాత్రం ఆడతాను అని తెలిపాడు ఈ 360 డిగ్రీస్‌ బ్యాట్స్‌ మెన్‌.

క్రికెట్‌ లో డివిలియర్స్‌ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బాల్స్), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బాల్స్), ఫాస్టెస్ట్ 150 (64 బాల్స్) రికార్డులు ఏబీ పేరిటే ఉన్నాయి. సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్ట్ స్కోరు (278 నాటౌట్) కూడా అతని పేరిటే ఉంది. ఇక ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ కూడా అతడే. 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8వేల 765 రన్స్ చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 53.50 సగటుతో 9వేల577 పరుగులు చేశాడు. 34 ఏళ్ల డివిలియర్స్ సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. IPL లో RCB తరుపున ఆడిన ఏబీ..ఆకట్టుకున్న విషయం తెలిసిందే. క్రికెట్‌లో ఎన్నో సరికొత్త విన్యాసాలను ప్రదర్శిస్తూ ఎలాంటి బాల్స్ అయినా.. అవలీలగా సిక్సర్లుగా మలిచే డివిలియర్స్‌ సడెన్ గా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో నిరాశ చెందుతున్నారు క్రికెట్ అభిమానులు.

Posted in Uncategorized

Latest Updates