ఏరిపారేస్తాం : కశ్మీర్ భద్రతకు బ్లాక్ క్యాట్ కమాండోలు

NSGజమ్ముకాశ్మీర్‌లో అదుపుతప్పిన శాంతి భద్రతలను దారికితీసుకువచ్చేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు శ్రీనగర్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందాన్ని పంపింది కేంద్రం. శ్రీనగర్ విమానాశ్రయంలో ఎన్‌ఎస్‌జి బృందాలను మోహరించారు. ఎన్‌ఎస్‌జి దళాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చారు. ఈ నెలాఖరులో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కు ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు బరితెగిస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు సైన్యంను సిద్ధంగా ఉంచింది. అమర్‌నాథ్ యాత్ర సాగే బల్టల్, పెహల్గాం మార్గాల్లో కీలక ప్రాంతాల్లో భద్రతాబలగాలను మోహరించారు. వీరికి వెనుదన్నుగా నిలిచేందుకు నిఘావర్గాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు సిఆర్‌పిఎఫ్ అదనపు డిజి. రాష్ట్రంలో తలెత్తే ఎటువంటి అవాంచనీయ ఘటనలనైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని జమ్ముకాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా భద్రతా బలగాలను ఆదేశించారు. సరిహద్దుల్లోని పోలీసుస్టేషన్లు, చెక్‌పోస్టు పాయింట్ల వద్ద బందోబస్తు పెంచారు. తనిఖీలు ముమ్మరం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై గస్తీని పెంచారు. ఎటువంటి సవాలునైనా తట్టుకుని ఉగ్రవాదం వెన్ను విరిచేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎస్‌జిని ఆదేశించింది కేంద్రం.

రంజాన్ మాసం సందర్భంగా కేంద్రం కాశ్మీర్‌లో నెలరోజులపాటు కాల్పుల విరమణను అమలు చేసింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయి. విరమణను ఎత్తివేసిన తర్వాత భద్రతాబలగాలు ఉగ్రవాదులను వేటాడడం ప్రారంభించారు. అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కాశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంట సైన్యాన్ని మోహరించారు.

Posted in Uncategorized

Latest Updates