ఐటీ అధికారుల విచారణకు రేవంత్ రెడ్డి హాజరు

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని ఆయకార్ భవన్ కు రేవంత్ రెడ్డితో పాటు… ఉదయ్ సింహ చేరుకున్నారు. కంపెనీల్లో పెట్టుబడులు… ఆర్థిక లావాదేవీలపై రేవంత్ రెడ్డి అతడి అనుచరులను ప్రశ్నిస్తున్నారు.

అధికారులు సోదాలు జరిపి సేకరించిన అంశాలపై రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులు, స్నేహితులు, అనుచరుల ఇంటరాగేషన్ లో రాబట్టిన అంశాలపై.. రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఐటీ అధికారులు.

ఆదాయానికి మించిన ఆస్తులు, ఓటుకు నోటు కేసుల విషయంలో దర్యాప్తు చేస్తున్న ఐటీ, ఈడీ అధికారులు… సెప్టెంబర్ 27, 28 తేదీల్లో మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో లాప్‌టాప్‌, హార్డ్ డిస్కులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసారు. అక్టోబర్ 3న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో… రేవంత్ ఐటీ కార్యాలయానికి వెళ్లారు.

కేసు దర్యాప్తులో ఇప్పటికే.. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, మామ పద్మనాభరెడ్డి, అనుచరుడు ఉదయసింహ, సెబాస్టియన్‌ లను.. ఓటుకు నోటు కేసు విషయంలో ప్రశ్నించారు అధికారులు. రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.20కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు…. ఇందులో రేవంత్ పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ ఫ్రా సంస్థతో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలపైనా ప్రశ్నించే  చాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ పైనే అనేక కంపెనీలు రిజిస్టర్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలతో రేవంత్ కు ఉన్న సంబంధాలపైనా విచారణ చేస్తున్నారని సమాచారం.

 

Posted in Uncategorized

Latest Updates