ఐటీ కారిడార్ లో భారీ ట్రాఫిక్ జామ్…3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

ఐటీ కారిడార్‌లోని కీలక ప్రాంతాల్లో శుక్రవారం వాహన దారులు పట్టపగలే చుక్కలు చూశారు. ఈ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ జామ్‌లు సాధారణమే అయినా.. శుక్రవారం అస్తవ్యస్త ప్రయాణ పరిస్థితులు వాహనదారుల్ని బెంబేలెత్తించాయి.మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌ పాంత్రాలన్నీ శుక్రవారం ఒక్కసారిగా ట్రాఫిక్‌ రద్దీతో హోరెత్తిపోయాయి. హైదరాబాద్ మెట్రో రైలు మూడో కారిడార్ పనుల్లో భాగంగా సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ జంక్షన్ మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సైబర్‌ ట‌వర్స్‌ నుంచి మైండ్‌ స్పేస్ వైపునకు వెళ్లే మార్గంలో సైబర్‌ గేట్‌వే వరకు దారిని మూసేశారు. ఇది కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే.

సైబర్‌ గేట్‌ దగ్గర నుంచి శిల్పారామం వైపు వాహనాలు వెళ్లకుండా దారి మూసేశారు. అదే మార్గంలో సైబర్‌ టవర్స్‌ నుంచి సైబర్‌ గేట్‌ వే వైపు వాహనాలు వెళ్లేలా ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చారు.

బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్‌ స్పేస్ మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపు వెళ్లే వాహనాలను లెమన్‌ ట్రీ కూడలితోపాటు సైబర్‌ గేట్‌ వే వరకే అనుమతిస్తున్నారు.

లెమన్‌ ట్రీ కూడలి, సైబర్‌ గేట్‌ వే దగ్గర నుంచి వాహనదారులు ఎడమ వైపునకు మళ్లి డెల్‌, ఒరాకిల్‌, టెక్‌ మహీంద్రా, సీఐఐ మీదుగా మెటల్‌ చార్మినార్‌ కు చేరుకునేలా ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి కొత్తగూడ, సైబర్‌ టవర్స్‌ వైపు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మళ్లింపుపై సరిగ్గా అవగాహన లేని వాహనదారులకు శుక్రవారం భయానక అనుభవం ఎదురైంది. ఆఫీసులకి వెళ్లేటప్పుడు.. తిరిగి ఇళ్లకు వచ్చేటప్పుడు ప్రయాణం నరకప్రాయంగా మారింది.

దీనిపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. డైవర్షన్స్ తర్వాత  చాలా కంప్లెయింట్ లు వస్తున్నట్లు తాను విన్నానని తెలిపారు. వెంటనే డీజీపీ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీని వ్యక్తిగతంగా విజిట్ చేయాలని, సమస్యల పరిస్కారానికి కృషి చేయాలని కోరినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates