ఒకటే వానలు : ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు

heavy-rainsభారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తాయి. వరదలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. దాదాపు మూడు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 24 గంటలుగా కురిసిన వర్షంతో త్రిపురలోని 8 జిల్లాలు జలమయమయ్యాయి. త్రిపులో 10 రోజులుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 41 ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. బాధితుల కోసం 64 శిబిరాలు ఏర్పాటు చేసింది త్రిపుర ప్రభుత్వం. వరదలతో ఇద్దరు చనిపోయారు.. మరికొందరి ఆచూకీ తెలియడంలేదని చెబుతున్నారు అధికారులు.

ఇక.. అస్సాంలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. బొకాఖట్ సబ్ డివిజన్ నీట మునిగింది. లోటాబరిలో జాతీయ రహదారి 37 జలమయం అయ్యింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డుపైకి ఇసుక, రాళ్లు కొట్టుకొచ్చాయి. భారీ వర్షాలు, వరదలతో వేల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని.. రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.

భారీ వర్షాలు మణిపూర్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వరదలతో రోడ్లపైకి భారీగా బురద చేరింది. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థ అస్థవ్యస్తం అయ్యింది. గిరిజనులకు బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసాల్లోకి నీరు చేరింది. స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ టీం, CRPF సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా మణిపూర్ లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates