24 గంటల్లో 12 చోరీలు : LBనగర్ లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

హైదరాబాద్ : సిటీలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. 24 గంటల్లో 12 చోరీలతో చేతి వాటం చూపించారు.  వరుస చోరీలతో LB నగర్ జోన్ లో స్థానికులను  హడలెత్తిస్తున్నారు స్నాచర్లు. ఆ మధ్య కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న స్నాచర్లు.. నిన్న బుధవారం సిటీ శివారు ప్రాంతాల్లో రెచ్చిపోయారు.. బుధవారం సాయంకాలం నుంచి.. ఇవాళ గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 12 చోరీలు చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృధ్ధులను టార్గెట్ చేస్తున్న స్నాచర్ బైక్ పై వచ్చి క్షణాల్లో గోల్డ్ చైన్స్ లాక్కెళ్తున్నారు. చైతన్యపురి, వనస్థలిపురం, ఎల్బీనగర్ లో ఏకంగా 12 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు.

హయత్ నగర్ లో ఈ రోజు ఉదయం 5 నిమిషాల వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ లు జరిగాయి.  నిన్న రాత్రి ఐదు దొంగతనాలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. హయత్ నగర్ లెక్చరర్ కాలనీలో ఓ పెళ్లికి వచ్చి ఇంటి బయట నిల్చున్న నల్గొండకి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు దుండగులు.

హయత్ నగర్ కుంట్లూర్ రోడ్ లో హనుమాన్ గుడి దగ్గర నిల్చున్న నిర్మల అనే మహిళ మెడలో నుండి 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు.

వనస్థలిపురంలో మరో గొలుసు దొంగతనం

వనస్థలిపురంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం వేళ వాకింగ్ చేస్తున్న ధనలక్ష్మి అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగారు చైన్ ను లాక్కెళ్లారు గొలుసు దొంగలు.

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ లోనూ గొలుసు దొంగతనం కేసు నమోదైంది. వరుస చైన్ దొంగతనాలు జరగడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా ప్రాంతాల్లో పికెట్స్ పెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డైన అనుమానితుల వీడియోలను పరిశీలిస్తున్నారు. డీసీపీ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని టీమ్… చైన్ స్నాచింగ్ సంఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. బైక్ పై తిరుగుతున్న ఇద్దరు గొలుసు దొంగల వయసు 35 ఏళ్ల లోపు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Posted in Uncategorized

Latest Updates