ఒకేసారి లక్షా 116 మొక్కలు నాటిన గజ్వేల్ పట్టణం


గజ్వేల్ పట్టణంలో ప్రారంభం అయిన హరితహారం.. రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే సారి లక్షా 116 మొక్కలు నాటారు ప్రజలు. పట్టణంలోని వివిధ ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించారు. ఆ వెంటనే మొక్కలు నాటేశారు ప్రజలు. ఆగస్ట్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో పలుసార్లు సైరన్ మోగించి.. అలర్ట్ చేశారు.

గజ్వేల్ హరితహారం కోసం వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా పెరిగిన ఆరోగ్యవంతమైన మొక్కలను తెప్పించారు అధికారులు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్ల నేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను పంపిణీ చేశారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో క్లస్టర్ లో 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  మొత్తం లక్షా 16 వేల గుంతలను మున్సిపాలిటీ పరిధిలో తవ్వించారు. కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరేడు వంటి 75 వేల పండ్ల మొక్కలతో పాటు 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సప్లై చేశారు.

పట్టణ ప్రాంతాల్లో నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతి ఇంటికీ రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలను ఇచ్చారు. ఇళ్ల ముందు, వెనకా ఉన్న ఖాళీ స్థలాల్లో  పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికీ సరఫరా చేసి..నాటించారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీ గార్డులను కూడా సిద్దం చేశారు. మొక్కలు నాటిన తర్వాత వర్షాలు అనుకున్నంతగా కురవకపోతే నీటి సౌకర్యం అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేలా అధికారులు, ప్రజాప్రతినిథులు, విద్యార్థులు, మహిళలను సిద్ధం చేశారు. ప్రతి ఇంట్లో ప్రతీ కుటుంబ సభ్యుడు కనీసం ఒక్క మొక్కైనా నాటేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు అధికారులు..

Posted in Uncategorized

Latest Updates