ఒకే ఒక్కడు.. ఒంటరిగా అంటార్కిటికాను దాటేశాడు

ఒకేఒక్కడు.. ఎలాంటి సాయంలేకుండా అంటార్కిటికాను దాటేశాడు. 54 రోజుల్లో 1,482 కిలోమీటర్లు నడిచాడు. మంచు ఖండంలో ఒక చివరి నుంచి మరో చివరికి వెళ్లిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఇంకొకరు ఆ రికార్డును అందుకోవాలన్నా ఆశ్చర్యపోయేలా చేశాడు. అతనే అమెరికాకు చెందిన కోలిన్‌‌ ఓ బ్రాడ్‌. నవంబర్‌ 3న అంటార్కిటికాలోని యూనియన్‌ ‌గ్లేసియర్‌ దగ్గరున్న బేస్‌ క్యాంప్‌ నుంచి మొదలైంది కోలిన్ ప్రయాణం. ఆయనతోపాటు మరో వ్యక్తి లూయిస్‌ రుడ్‌ కూడా రేస్‌ మొదలెట్టాడు. తొలి వారం రుడ్‌ ముందంజలో ఉన్నా వారం తర్వాత కోలిన్‌‌ లీడ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి అతనే ముందున్నాడు. చివరికి అతనే ముందుగా గమ్యం చేరుకున్నాడు. రూడ్‌ ఇంకా పట్టుదలతో గమ్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు.

చివరి 32 గంటలు ఏకబిగిన

రెండు నెలల నిర్విరామ ప్రయాణంలో కేవలం సగం రోజే కోలిన్‌ ‌రెస్టు తీసుకున్నాడు. అది కూడా తను వేసుకున్న ‘స్కీ’ షూ పాడైపోవడంతో నవంబర్‌ 29న ఆగిపోవాల్సి వచ్చింది. ప్రయాణంలో భాగంగా రోజూ 20, 30 మైళ్లు నడిచేవాడినని కోలిన్‌‌ తెలిపాడు. ప్రతి రోజూ సుమారు 12 గంటలు ట్రెక్కింగ్‌ చేశాక రాత్రి 8 గంటలకు ఆగేవాడినని.. కానీ గత రెండు వారాలు రాత్రి 9 వరకు నడిచానని, క్రిస్మస్‌ రోజు రాత్రి 11.00 గంటలు అయిందని చెప్పాడు. ఇక చివరి 124 కిలోమీటర్లను నిద్రపోకుండా 32 గంటల  పాటు ఏకబిగిన నడిచానన్నాడు. ఆ 32 గంటలు ఏ మ్యూజిక్‌‌ వినలేదని, గమ్యం చేరుకోవాలని మాత్రమే మదిలో ఉందని చెప్పాడు. 54 రోజుల తర్వాత లక్ష్యాన్ని చేరుకోవడం అద్భుతంగా అనిపించిందని తెలిపాడు.

ఏ సాయం లేకుండా

గతంలో నార్వేకు చెందిన రొవాల్డ్ అముండ్సేన్‌‌, ఇంగ్లాండ్‌కు చెందిన రోబర్ట్‌‌ ఫాల్మన్‌ స్కాట్‌ అంటార్కిటికా దక్షిణ ధృవం చేరుకున్న వ్యక్తులుగా రికార్డు సృష్టించారు. బోర్జ్‌‌ ఔర్జ్‌‌ స్లాండ్‌ 1996–97లో ఒక్కడే ఖండాన్ని దాటాడు. అయితే దానికి ఆయన ఓ కైట్‌ సాయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురు వ్యక్తులు కైట్‌ సాయం లేకుండా ప్రయత్నం చేసినా కుదరలేదు. కానీ కోలిన్‌‌ 54 రోజుల్లో ప్రయాణాన్ని పూర్తిచేశాడు. 2016లో ఇంగ్లిష్‌ వ్యక్తి హెన్రీ వోర్స్‌‌లే 900 కిలోమీటర్లు నడిచినా అక్కడే చనిపోయాడు.

Posted in Uncategorized

Latest Updates