ఒకే రోజులో : ఉదయం కాషాయ కండువా…రాత్రికల్లా కాంగ్రెస్ కండువా

పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డిగురువారం దయం బీజేపీలో చేరి, రాత్రికల్లా తిరిగి కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లారు. ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్ కాషాయ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని నమ్మి ఆమె బీజేపీలో చేరారని, తద్వారా రాష్ట్రంలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేమీ కాదని, ఆ స్వేచ్చ వారికి ఉందని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోడీ విధానాలు, సంక్షేమ పధకాలు నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు పద్మినీరెడ్డి చెప్పారు. అవకాశం కల్పిస్తే సంగారెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి సిద్దమన్నారు.

 

రాత్రికల్లా కాంగ్రెస్ లోకి

పద్మినీరెడ్డి బీజేపీలో చేరడం, మీడియాలో దీనిపై వార్తలు రావడంతో కాంగ్రెస్ లో కలకలం రేగింది. అన్ని వైపుల నుంచి ప్రశ్నలు రావడంతో దామోదర కూడా అసహనం వ్యక్తం చేశారు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, స్త్రీలకు స్వేచ్చ ఉండొద్దా అని గజ్వేల్ లో ప్రసంగించారు. కానీ రాత్రికల్లా సీన్ మారిపోయింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పద్మినీరెడ్డి ప్రకటించారు. పీసీసీ అధికార ప్రతినిధి ప్రియదర్శిని చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యకర్తల మనోభావాలను అర్ధం చేసుకున్నానని, మధ్యాహ్నాం నుంచి కార్యకర్తలు అంతా బాధ పడుతున్నారని, బీజేపీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటన అని ఆమె వివరణ ఇచ్చుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates