ఒక్క క్లిక్ తో ఐఐటీ బాంబే సీటు కోల్పోయిన విద్యార్ధి.. ఉత్కంఠగా మారిన సుప్రీం తీర్పు

అతనో అనాధ. అయినా మొక్కవోని దీక్షతో ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) 2020 ఫలితాల్లో ఆలిండియా 270వ ర్యాంక్ సాధించాడు. దీంతో బాంబే ఐఐటీలో సీటు దక్కించుకున్నాను. నా అనుకున్నవాళ్లెవరూ లేరు. తాను బాంబే ఐఐటీలో చదువుకోవాలన్న కలను నెరవేర్చుకున్నాడు. కానీ ఓ చిన్న తప్పిదం అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది. న్యాయ పోరాటం కోసం హైకోర్ట్..,సుప్రీం కోర్ట్ లను ఆశ్రయించాడు. బాధిత విద్యార్ధి కేసును విచారించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించింది. మరికొన్ని గంటల్లో ఆ కేసు తాలుకూ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఆ తీర్పుతో అతడి జీవితం మారిపోతుందా లేదా అని తెలియాల్సి ఉంది.

ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా  ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) లో 270వ ర్యాంక్ తో సంతోషంగా అక్టోబర్ 18న జరిగిన తొలి కౌన్సిలింగ్ లో బాంబే ఐఐటీలో ఉచితంగా సీటు దక్కించుకున్నాడు. అయితే ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని, తన నెంబర్ చెక్ చేసుకునేందుకు అక్టోబర్ 31 న సిద్ధాంత్ మళ్లీ లాగిన్ అయ్యాడు. ఆ సమయంలో వెబ్ సైట్ లో బోనోఫైడ్ కోసం ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేశాడు. వాస్తవానికి ఆ ఆప్షన్ నాకు బాంబే ఐఐటీలో సీటు వద్దు అని స్వయంగా వదులుకున్నట్లు లెక్క. సిద్ధాంత్ అదే పని చేశాడు. కానీ ఆ విషయం సిద్ధాంత్ కు తెలియదు.

తీరా క్లాసులకు అటెండ్ అయ్యేందుకు ఐఐటీ బాంబేకి వెళ్లి  ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) లో సీటు దక్కించుకున్నవాళ్ల లిస్ట్ చెక్ చేసుకున్నాడు. అందులో సిద్ధాంత్ పేరు లేకపోవడంతో షాక్ తిన్నాడు. జరిగిన విషయం యాజమాన్యానికి చెప్పినా లాభం లేకుండా పోయింది. ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నీకు కేటాయించిన సీటు వేరేవాళ్లకి వెళ్లిపోయిందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని విద్యార్ధి సిద్ధాంత్ హైకోర్ట్ ను ఆశ్రయించాడు. హైకోర్ట్ చెప్పినా సరే ఐఐటీ బాంబే వినిపించుకోకపోవడంతో సుప్రీం కోర్ట్ మెట్లెక్కాడు.

చిన్నపొరపాటు వల్ల తన జీవితం నాశనం అవుతుందని ,అనాథనైన తన కోసం అదనంగా ఒకే ఒక్క సీటును కేటాయించాలని సుప్రీం కోర్ట్ ను కోరాడు. దీంతో అతని వినతిని సుప్రీం కోర్ట్ అంగీకరించింది. డిసెంబర్ 1న ఈ కేసును విచారించనుంది. మరి కేసు విచారణలో సుప్రీంకోర్ట్ విద్యార్ధి జీవితాన్ని నిలబెడుతుందా లేదంటే మరో సారి ప్రయత్నించమని తీర్పు వెల్లడిస్తుందా అని వేచి చూడాల్సి ఉంది.

Latest Updates