ఒక్క ట్వీట్….26 మంది బాలికలకు పునర్జన్మనిచ్చింది

MAHIనేటి సమాజంలో సోషల్‌ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రోజుల్లో ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కొందరి జీవితాలను మార్చేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ వైపు ఎంత చెడు జరుగుతుందో అంతేస్ధాయిలో మంచి కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ 26 మంది అమ్మాయిల జీవితాల్ని కాపాడింది.

శుక్రవారం(జులై-5)న ముజఫర్‌నగర్-బాంద్రా అవధ్ ఎక్స్‌ప్రెస్‌(19040) లో ఎస్ 5 కోచ్‌ లో ప్రయాణిస్తున్న ఆదర్శ్ శ్రీవాత్సవ అనే ఓ ప్యాసింజర్ కి అదే కోచ్ లో భయంతో ఏడుస్తూ కూర్చున్న 26 మంది బాలికలు కన్పించారు. దీంతో ఆదర్శ్ కి ఎందుకో డౌట్ వచ్చింది.  మెదడులో ఒక్కసారిగా గజినీ ట్రైన్ సీన్ గుర్తుకువచ్చింది. ఇది నిజంగా బాలికల కిడ్నాప్ అని నమ్మాడు. దీంతో వెంటనే తన ట్విట్టర్ ద్వారా….  తాను ప్రయాణిస్తున్న ఎస్ 5 కోచ్ లో మైనర్ బాలికలు ఏడుస్తూ, భయంతో ఉన్నారని, అందులో కొంతమంది మైనర్ బాలికలు ఉన్నారని, తాను ప్రస్తుతం హరినగర్ స్టేషన్ దగ్గర ఉన్నానని, తరువాత వచ్చే స్టేషన్ బాగా స్టేషన్ అని, ఆ తరువాత గోరఖ్ పౌర్ స్టేషన్ అని, వెంటనే వచ్చి దయచేసి కాపాడండి అంటూ  రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశాడు.

దీంతో వెంటనే అలర్ట్ అయిన రైల్వే అదికారులు వారణాసి, లక్నో అధికారులు RPF, గోరఖ్ పూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సాధారణ డ్రెస్ లో కప్తాన్‌ గంజ్ దగ్గర రైలు ఎక్కారు ఇద్దరు జవాన్లు. బోగీలో 26 మంది బాలికలతోపాటు 22 ఏళ్లు, 55 ఏళ్ల వయస్సున్న వ్యక్తులున్నట్లు గుర్తించారు. నర్కటిక్యాగంజ్ నుంచి ఇద్ఘా ప్రాంతానికి బాలికలను తరలిస్తున్నట్లు గుర్తించి వారిని కాపాడారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ట్వీట్ చేసిన ఆదర్శ్ శ్రీవాత్సవను పోలీసులు అభినందించారు. కిడ్నాప్ చేయబడ్డ బాలికలు కూడా… మాకు పునర్జన్మ ఇచ్చావు అన్నా అంటూ ఆదర్శ్ కు కృతజ్ణతలు తెలిపారు. బాలికలను శిశు సంక్షేమ విభాగానికి తరలించారు పోలీసులు. బాలికలందరూ బీహార్ లోని వెస్ట్ చంపారన్ ప్రాంతానికి చెందిన వారని, వారి తల్లిదండ్రుల దగ్గరకు వాళ్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్క ట్వీట్ తో 26 మంది బాలికలను కాపాడిన ఆదర్శ్ శ్రీవాత్సవను దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates