ఒడిశా,జార్ఖండ్ లో ‘రైతు బంధు’


తెలంగాణలో అమలవుతున్న ‘రైతు బంధు’ పథకం తరహాలోనే ఒడిశా, జార్ఖండ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలను తీసుకువచ్చాయి. అన్నదాతకు పెట్టుబడి సాయమందించేందుకు రెండు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఒడిశాలో ‘కృషక్‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్‌ లైవ్లీవుడ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇంకమ్‌ అగ్‌మెంటేషన్‌ (కాలియా)’ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికి రూ. 10వేల కోట్లు కేటాయించారు.నిన్న(శుక్రవారం) సీఎం నవీన్‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షత జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పథకాన్ని రాష్ట్రంలోని 30లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు వర్తింపజేస్తామని నవీన్‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌ మీడియాకు తెలిపారు. పథకంలో భాగంగా ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ. 10వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు.

ఖరీఫ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌లో రూ. 5వేలు, రబీ సీజన్‌లో రూ. 5వేలు చొప్పున చెల్లింపులు ఉంటాయన్నారు. కౌలు రైతులు, కూలీలు కూడా దీని పరిధిలోకి వస్తారని తెలిపారు. రుణమాఫీ అనేది కొన్నివర్గాల రైతులకే ఉపయోగకరంగా ఉంటుందని, కాలియా పథకం మాత్రం రాష్ట్రంలోని 92శాతం మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తుందని నవీన్‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. అటు ‌‌‌‌జార్ఖండ్ ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. ఎకరాకు రూ. 5వేల చొప్పున అందించాలని నిర్ణయించిన సర్కార్.. ఐదు ఎకరాల వరకు పరిమితి పెట్టుకుంది. ఇందుకోసం రూ. 2250 కోట్లు కేటాయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ శుక్రవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి కృషి యోజన కింద దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. ఎకరా లోపు భూమి ఉన్న రైతుకు కూడా రూ. 5వేలు అందజేస్తామని చెప్పారు.  ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 22.76 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు

Posted in Uncategorized

Latest Updates