ఒత్తిడే కారణమా..? : కర్నూలు జిల్లాలో VRO సూసైడ్

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తాసిల్దార్ కార్యాలయంలో VRO గా విధులు నిర్వహిస్తున్న హజివాలి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం (జూలై-11) ఉదయం కార్యాలయానికి చేరుకున్న VRO..  ఓ గదిలోకి వెళ్లి, పురుగుల మందు తాగాడు. గమనించిన  సిబ్బంది హజివాలిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..  అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు డాక్టర్లు.

విషయం తెలుసుకున్న తహసిల్దార్ ప్రేమ్ సాగర్  కోయిలకుంట్ల ఎస్సై మోహన్ రెడ్డి  ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.  VRO  మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోయిలకుంట్ల మండలంలోని బిజినవేముల గ్రామానికి VROగా విధులు నిర్వహిస్తున్న అతనిపై రాజకీయ ఒత్తిళ్లతో పాటు అధికారుల వేధింపులు కూడా తోడు అయ్యాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో VROగా పనిచేసిన వ్యక్తి బిజినవేముల గ్రామంలో పొలం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని సమాచారం.  ఆ వ్యవహారాన్ని చక్కదిద్దాలని అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ ప్రజాప్రతినిధి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి తన కార్యకర్తల మాటలు నమ్మి, VROను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.

దీంతో మనస్తాపానికి గురైన VRO సెలవుపై వెళ్లేందుకు MROను పర్మిషన్ అడగగా.. అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. VRO హజివాలి  తమ బంధువులకు ఫోన్ చేసి ఇక్కడ వేధింపులు ఎక్కువయ్యాయని.. తనను బదిలీ చేయించాలని ఉన్నతాధికారులకు వేడుకున్నట్లు ఇటీవల చెప్పినట్లు తెలిపారు బంధువులు. అయితే బంధువులు సముదాయింపు చేసినప్పటికీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన VRO ఆత్మహత్యకు ఒడిగట్టాడు. దీంతో మృతుని బంధువులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అడిగినప్పటికీ వారు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు.

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోయిలకుంట్ల కు చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. అధికారులు అధికార పార్టీ నేతలు ఒత్తిడి వలన VRO మృతిచెందాడని ఆయన ఆరోపించారు. CI శ్రీనివాసరెడ్డి పరిస్థితిని సమీక్షించి నంద్యాల RDO శ్యాంసుందర్ రెడ్డి, తాసిల్దార్ ప్రేమ్సాగర్ లతో చర్చలు జరిపి, మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇప్పించారు. దీంతో బాధితులు శాంతించి మృతదేహాన్ని రోడ్డుపై నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంమీద VRO మృతి కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికమయ్యాయని.. పలువురు రెవెన్యూ సిబ్బంది చర్చించుకోవడం గమనార్హం.

Posted in Uncategorized

Latest Updates