ఒప్పందం కుదిరింది.. తెలంగాణలో విమాన ఇంజిన్ల తయారీ ఫ్యాక్టరీ

KTRతెలంగాణ రాష్ట్రానికి మరో అద్భుత అవకాశం దక్కింది. ప్రపంచ స్థాయి ప్రఖ్యాత పరిశ్రమలకు వేదిక అవుతున్న తెలంగాణ.. అతి త్వరలో మరో ఘనతను సాధించనుంది. మేడిన్ తెలంగాణ ముద్రతో విమాన ఇంజిన్లు ఇక్కడి నుంచి వివిధ ప్రపంచ దేశాలకు ఎగుమతి కానున్నాయి. ఇందుకు ఉద్దేశించిన ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, అంతర్జాతీయ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ (GE) సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఆదిభట్లలో ఏర్పాటు చేయబోయే ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం భూమి పూజ కార్యక్రమం సోమవారం ( ఫిబ్రవరి-12)HICC లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరిగింది. ఈ కేంద్రం ఏర్పాటు తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి మరింత ఊతం ఇస్తుందని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకోవటం పట్ల టాటా, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దిగ్గజ సంస్థలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ నెలకొన్న ఎకో సిస్టం, నైపుణ్యం కలిగిన విద్యార్థులు ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని మంత్రి చెప్పారు. రెండు స్ట్రాంగ్ ఎయిరోస్పేస్ పార్కులు, ఐదు ఎయిర్ స్ట్రిప్స్‌కు అదనంగా మరో తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ఉండటం ఇక్కడి విమానయాన రంగం అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఒప్పందం చేసుకున్న స్వల్ప వ్యవధిలోనే కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates