ఓటర్ల తుది జాబితా ప్రకటించొచ్చు.. ఈసీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ఓటరు జాబితా పిటిషన్ పై విచారణను ఈనెల 12 తేదీకి వాయిదా వేసింది రాష్ట్ర హైకోర్టు. ఓటర్ల తుది జాబితాను విడుదల చేయొచ్చని ఎన్నికల సంఘానికి తెలిపింది. బూత్ లెవెల్ నుంచి ఓటర్ల జాబితాను ఈనెల 12న కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటరు జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించేందుకు.. ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపాలని ఈసీని ఆదేశించింది. ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి పర్మిషన్ ఇచ్చింది. నామినేషన్ లు దాఖలు చేసే చివరి మూడు గంటల వరకు కూడా ఓటర్లు తమ పేరును జాబితాలో నమోదుచేసుకోవచ్చని సూచించింది. మరోవైపు.. అసెంబ్లీ రద్దు పిటిషన్, కొత్త ఓటర్ల నమోదు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది.

ఓటర్ జాబితాలో అవకతవకలపై కోర్టులో తమ వాదనలు వినిపించారు లాయర్లు. ఓటరు నమోదు ప్రక్రియపై తమకూ కొన్ని అనుమానాలున్నాయన్న చీఫ్ జస్టిస్… ఏ ప్రాతిపదికన ఓటరు నమోదు చేస్తారో.. వివరంగా చెప్పాలని ఈసీని ఆదేశించారు. యంగ్ ఓటర్స్ తరపు న్యాయవాది నిరూప్ రెడ్డి రెడ్డి వాదిస్తూ.. “ఆరు నెలల సమయం ఉండగా… మూడు నెలలోపే ఎన్నికలు నిర్వహించాలని పట్టుదల ఏంటి? ఎలెక్టోరల్ ప్రొసీజర్ సిద్ధం అవ్వకుండా ఎలక్షన్స్ కి ఎలా వెళ్తారు? తెలంగాణ సభ గౌరవం రక్షించబడలనేది మా అభిలాష.  20 లక్షల ఓట్లు తగ్గయంటే  ఆంధ్రకు తరలిపోయాయి అంటున్నారు. ఆంధ్రాలో ఓటర్ లిస్ట్ ప్రకారం అక్కడ 17వేల ఓట్లు తగ్గాయి. మరి ఇక్కడి నుంచి ఆంధ్రకు వెళ్తే.. అక్కడ ఎందుకు తగ్గాయి” అని అన్నారు.

ఈసీ తరపు న్యాయవాది వాదిస్తూ.. అందరూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని.. తాము మాత్రం చట్ట పరంగా నిబంధనలకు లోబడే ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. సభ రద్దు అయిన తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలనేదే తమ ఉద్దేశమన్నారు. కట్ ఆఫ్ తేదీ ని మార్చే అధికారం తమకు లేదన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్ తరఫున లాయర్ జంధ్యాల రవిశంకర్ తన వాదనలో.. “ నాకు గంట సమయం ఇస్తే ఓటర్ లిస్ట్ లో జరిగిన అవకతవకలను నిరూపిస్తా. శాస్త్రీయంగా నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సభ రద్దు ఆశాస్ట్రీయంగా జరిగింది. ఆరు నెలల సమయం ఉండగా ఇంత తొందరపాటు ఎందుకు” అని అన్నారు.

చివరగా.. పిటిషనర్ వేసిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని ఈసీ తరఫు లాయర్ అన్నారు. 2016-17ఓటర్ లిస్టును కోర్టుకు ఇచ్చారని ఈసీ వాదించింది. ఓటరు లిస్ట్ లో తప్పులుంటే సరిచేస్తామని కోర్టుకు ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates