ఓట్లు గల్లంతయ్యినందుకు సారీ: రజత్ కుమార్

హైదరాబాద్: ఓట్ల గల్లంతుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సారీ చెప్పారు. ’ 2016,2017 జాబితాల్లో కొన్ని పేర్లు మిస్ అయ్యాయి. 2018 జనవరి జాబితాలో కూడా పేర్లు గల్లంతయ్యాయి. సెప్టెంబర్ 10 లిస్ట్ లో లేదు. ఆ సమయంలోనే ప్రచార కార్యక్రమాలు రూపొందించాం. అప్పుడు పేర్లు గల్లంతైన వారు ఓటు నమోదు చేసుకోలేదు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు చెక్ యువర్ నేమ్ పేరుతో క్యాంపెయిన్ చేశాం. దాన్నీ ఉపయోగించుకోలేకపోయారు. ఓట్ల గల్లంతుకు క్షమాపణలు కోరుతున్నా. విచారణ జరిపిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నాటికి తప్పులను సరిదిద్దుతాం’ అని అన్నారు.

ఓటు కోల్పోయామన్న బాధతో చాలా మంది తనకే స్వయంగా ఫోన్ చేసి కంప్లైంట్ చేశారన్నారు. ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయిన వారు మళ్లీ ఓటరుగా అప్లై చేసుకోవాలని, డిసెంబర్ 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు 67 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. 2014 ఎన్నికల్లో 69.5 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ సారి కూడా అదే రీతిలో పోలింగ్ జరిగిందన్నారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని.. దీంతో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలను టైట్ సెక్యూరిటీ మధ్య గోడౌన్స్ కు తరలించామని.. అక్కడ 24 గంటలు కరెంట్ సరఫరాతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందని రజత్ కుమార్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates