ఓ వృద్ధురాలి దీనగాథ: మరుగుదొడ్డిలోనే జీవనం

వెలుగు నెట్ వర్క్: ఏడుపదుల వయస్సు. ఉన్నదే చిన్నపూరి గుడెసె. అదీ వానకు కూలి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచీ నిలువ నీడ లేకుండాపోయింది. స్వచ్ఛభారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద మంజూరైన మరుగుదొడ్డే ఆమె నివాసంగా మలుచుకుంది. ఏడాదిగా అందులోనే ఉంటోంది. స్వచ్ఛంద సంస్థలు,కొందరు దాతలు ఆదుకుంటామని చెప్పినా ఆచరణలోకి రాలేదు. ఇప్పటికీ ఆ వృద్ధురాలు వెయ్యి రూపాయల ఆసరా పింఛన్‌తో మరుగుదొడ్డిలోనే బతుకీడుస్తోంది…ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోటకు చెందిన వెంగళ నాగరత్నం.

నాగరత్నం భర్త ఆశీర్వాదం కొన్నేళ్ల కిందటే చనిపోయాడు. పిల్లలు కూడా లేకపోవడంతో ఏడు పదుల వయసులో నాగరత్నం కూలి చేసుకుంటూ ఒంటరిగానే బతుకీడుస్తోంది. వచ్చే కూలి డబ్బులకు తోడు.. ప్రభుత్వం ఇచ్చే నెలకు వెయ్యి రూపాయల పింఛనే ఆమెకు ఆసరా. ఎప్పుడో కట్టుకున్న పూరిగుడిసె రెండేళ్ల కింద కురిసిన వర్షాలకు కూలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇల్లు ఆమెకు మంజూరు కాలేదు. దీంతో స్వచ్ఛభారత్ కింద మంజూరైన మరుగుదొడ్డిలోనే జీవిస్తోంది. నాగరత్నం పరిస్థితిపై స్పందించిన గ్రామస్తులు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు ఆమెకు కొంత నగదు సాయం చేశారు. పలువురు ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ రెండు నెలల నుంచి పరిస్థితి అలాగే ఉంది. దీంతో మరుగుదొడ్డిలోనే బతుకీడుస్తోంది.

వర్షాలకు ఇల్లు కూలిపోయి రెండేళ్లకు పైనే అయిందని తెలిపింది వెంగళ నాగరత్నం. అప్పటి నుంచి చాలా మందికి ఇల్లు లేదని దరఖాస్తులు ఇచ్చానని తెలిపింది. అధికారులు గానీ,లీడర్లు గానీ ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. నాయకులు మారుతున్నా…తన బతుకు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Posted in Uncategorized

Latest Updates