కంటివెలుగు: 40 లక్షల మందికి ఫ్రీగా కళ్లద్దాలు

అభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అన్ని వర్గాల వారికి అండగానిలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రాష్ట్రావ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఫ్రీగా కళ్లద్దాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. అందులో 40 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఎస్సల్లార్‌’ సరఫరా చేయనుంది. ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు జిల్లాలకు సరఫరా అయ్యాయి. మొత్తంగా 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్‌ గ్లాసులు సరఫరా చేస్తారు. వాటిని అక్కడికక్కడే వెంటనే అందజేస్తారు. ఇతర కారణాలతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్‌ ఇస్తే సంబంధిత కంపెనీ మూడు, నాలుగు వారాల్లో సరఫరా చేయనుంది.

ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.100 ప్రకారం… ఎస్సల్లార్‌ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి ఆఫరేషన్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరికీ ప్రభుత్వం ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. ఇందుకోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ద్వారా అమలు చేస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 106 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశారు.

అందులో 940 మంది మెడికల్‌ ఆఫీసర్లు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారికి సాయంగా 8 వేల మంది సిబ్బంది ఉంటారు. వారంతా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నవారే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు నెలలపాటు అమలుచేస్తారు. భవిష్యత్తులో కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates