కచ్చితంగా తెలుసుకోవాల్సిందే : మాల్స్ లో ఫ్రీ పార్కింగ్ ఇలా

parking-mallsఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ లో కొత్త పార్కింగ్ చట్టం అమలు కాబోతున్నది. పార్కింగ్ ఛార్జీల విధానాన్ని క్రమబద్దీకరించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. మాల్స్, మల్టీఫ్లెక్స్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు కొత్త పార్కింగ్ విధానానికి అనుగుణంగా ప్రచారం చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. పెద్ద పెద్ద బోర్డులు, గోడలపై రాతలతో కస్టమర్లకు అవగాహన కల్పించాలని యాజమాన్యాలను కోరారు. ఇక నుంచి ఇష్టానుసారం పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం పార్కింగ్ సమయాన్ని తెలుపుతూ స్టాంప్ వేయటం లేదా ప్రత్యేక డివైజ్ ద్వారా తెలియజేయాలని కోరారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 2018 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

కొత్త పార్కింగ్ ఛార్జీలు ఇలా ఉన్నాయి :

మొదటి అర గంట (30 నిమిషాలు) : ఎలాంటి పార్కింగ్ ఫీజు ఉండదు. వసూలు చేయకూడదు. ఉచితంగా పార్కింగ్ ఉంటుంది. ఎంట్రీ – ఎగ్జిట్ దగ్గర టైం చూసి ఫ్రీ పార్కింగ్ అనుమతికి అవకాశం ఇస్తారు.

31 నుంచి 60 నిమిషాల వరకు : మాల్స్, మల్టీఫ్లెక్స్ లు, వాణిజ్య సముదాయాల్లోకి వెళ్లిన తర్వాత ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ. ఎలాంటి వస్తువు కొనుగోలు చేయకపోతే ఫీజు వసూలు చేస్తారు.

గంట తర్వాత (60 నిమిషాలు పైన) : సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు చూపిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. అయితే ఓ కండీషన్ ఉంది. సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఫీజు వసూలు చేయరు. అలా కాకుండా సినిమా టికెట్ రూ.150 ఉండి.. పార్కింగ్ ఫీజు 170 ఉంటే.. పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates