కటకటాల్లో ఏడేళ్లు : లంచం ఇచ్చే వారికీ జైలు శిక్ష


కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అవినీతి నిరోధక చట్టం -1988కి సవరణ చేసింది. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదం లభించింది. అమల్లోకి వచ్చిన కొత్త అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇవ్వటం కూడా ఘోర నేరం. అక్రమ మార్గాల్లో పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వటం, ప్రయోజనాల ఆశ చూపించటం, ఇస్తానని హామీ ఇవ్వటం కూడా నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఏడేండ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. లంచం ఇచ్చిన వ్యక్తుల వివరాలను వారం రోజుల్లోగా సంబంధిత అధికారులు, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక లంచం తీసుకున్న వారికీ శిక్షలు ఉంటాయి. ప్రస్తుతం లంచం తీసుకున్న కేసుల్లో మూడేళ్ల వరకు శిక్ష ఉంటే.. కొత్త చట్ట సవరణ ప్రకారం వారికి కూడా ఏడేండ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.

ఇప్పటి వరకు ఉన్న ఏ చట్టాల్లోనూ లంచం ఇవ్వజూపే వ్యక్తులకు శిక్షలు లేవు. ఇప్పుడు ఈ చట్టం తీసుకురావటం వల్ల వారు కూడా నేరం చేసినట్లు అవుతుంది. అయితే కొత్త చట్టంలో ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలు, బ్యాంకర్లు, ఇతర సంస్థల అధికారులకు రక్షణ కల్పించారు. సంబంధిత సంస్థల ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నేతలు, బ్యాంకర్లను సీబీఐ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారించలేవు. కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.

Posted in Uncategorized

Latest Updates