కదిలితే కనిపెట్టేస్తారు : అన్ని బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్

ప్రభుత్వ రావాణా వ్యవస్థను పటిష్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రవేట్ ట్రాన్స్ పోర్ట్ సంస్థల అనుసంధానంతో.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సౌకర్యవంతమైన సేవలు అందించటంతో పాటు.. ఆర్టీసీ, మెట్రో సంస్థలను ఆదాయాల బాట పట్టించేందుకు రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరలో గ్రేటర్ పరిధిలో మరికొన్ని కొత్త విధానలు అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. మెట్రో రైలుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ. అవసరమైతే కొన్ని బస్సుల రూట్లలో మార్పులు చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు.. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.. ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ.

హైదరాబాద్ బస్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. మెట్రో రైల్ ఎండీ, ప్రైవేట్ సంస్థలైన ఓలా, ఊబర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించటంతో పాటు.. మెట్రో, ఆర్టీసీ, ఓలా, ఊబర్ లాంటి ట్రాన్స్ ఫోర్ట్ కోసం.. రానున్న రోజుల్లో ఒకే కామన్ కార్డ్ విధానం తేవాలనే విషయంపై చర్చించారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం బస్సులకు ట్రాకింగ్ విధానం ఉందన్నారు ఇంచార్జి ఎండీ. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో అన్నీ బస్సులకు ట్రాకింగ్ విధానం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజారావాణా పెరిగితే వ్యక్తిగత వహనాలు తగ్గుతాయన్నారు మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి. తెలంగాణ సవారీ తరహాలో మరో యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రియలిస్టులు.. హైదరాబాద్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారన్న ఆయన.. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిన్న మొదటి సమావేశం నిర్వహించిన అధికారులు.. విడుతలవారీగా సాధ్యాసాధ్యాలపై చర్చించాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో సిటీ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు.. మెట్రో రైల్, ఆర్టీసీని ఆదాయపరంగా బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates