కదిలిరండి.. మొక్కలు నాటుదాం : రేపే మహా హరితహారం

ప్రతి ఇంటా చెట్టు.. అదే మన ప్రగతికి మెట్టు.. ఈ నినాదంతో మహా హరితహారం కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న హరితహారానికి తెలంగాణ అంతా సిద్ధం అయ్యింది. ఊరూవాడా మొక్కలు నాటేందుకు ఉరకలేస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మహా హరితహారం సంబురంగా జరగబోతోంది. ఒకేసారి లక్షా 116 మొక్కలు నాటేందుకు సిద్ధం అయ్యింది. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో మొక్కను నాటనున్నారు. అదే సమయంలో పట్టణంలోని అన్ని మసీదుల్లో సైరన్ మోగడంతో.. ప్రజలంతా మొక్కలను నాటుతారు. ప్రజ్ఞాపూర్‌తోపాటు రాజిరెడ్డిపల్లి, క్యాసారం, సంగుపల్లి, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, గుండన్నపల్లి  గ్రామాలు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాన్ని ఎనిమిది క్లస్టర్లుగా విభజించారు. ఇప్పటికే లక్షా 25వేల గుంతలు తవ్వారు. వేల ట్రీగార్డులు సిద్ధం అయ్యాయి.

గజ్వేల్ పట్టణంలో పండ్లు, పూలు, కొబ్బరి, చింత, మామిడి, అల్లనేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను ఎక్కువగా నాటనున్నారు. హరితహారం సక్సెస్ కోరుతూ పట్టణంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు అధికారులు.  విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. మహిళలు గడపగడపకు బొట్టు పెట్టి హరితహారంలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. స్వచ్చంధ సంస్థలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఒక్కరు.. మరో ముగ్గురితో మొక్కలు నాటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ ఛాలెంజ్ స్వీకరించి తమ వంతు పాత్ర పోషించారు.

Posted in Uncategorized

Latest Updates