కన్నడ రాజకీయం: బెంగళూరుకు రోడ్డు మార్గంలో నేతలు

busకన్నడ రాజకీయాలు భాగ్యనగరానికి చేరాయి. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు హైదరాబాద్ లో క్యాంప్ పెట్టాయి. అటు.. సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా శుక్రవారం(మే-18) హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తర్వాత నేతలంతా రోడ్డు మార్గంలో బస్సుల్లో బెంగళూరుకు బయలుదేరారు.

కర్ణాటక క్యాంపు రాజకీయాలు హైదరాబాద్ చేరాయి. ఎమ్మెల్యేలు కేరళలో క్యాంపు పెరడతారని ప్రచారం జరిగినా.. అనూహ్యంగా హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని  తాజ్ కృష్ణ, నోవాటెల్ హోటళ్లలో మకాం పెట్టారు. మాజీ మంత్రి శివకుమార్ నేతృత్వంలో రెండు పార్టీల ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి.. మూడు మార్గాల ద్వారా హైదరాబాద్ తీసుకువచ్చారు. కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర.. ముందుండి ఈ వ్యవహారాల్ని నడిపించారు.

సాయంత్రానికి క్యాంప్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, జేడీఎస్ లోక్ సభాపక్షనేత కుమారస్వామి హైదరాబాద్ చేసుకున్నారు. సిద్దరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇదే టైంలో బెంగళూరు నుంచి జేడీఎస్ నేత కుమారస్వామి కూడా తాజ్ కృష్ణకు వచ్చారు. నోవాటెల్ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలను కూడా తాజ్ కు పిలిపిద్దామనుకున్నా.. చివరి నిమిషంలో ఆనిర్ణయం మార్చుకున్నారు.

కర్ణాటక ఎల్పీ మీటింగ్ ముగిసాక.. రెండు పార్టీల నేతలు భేటీ అయ్యారు. రేపు(శనివారం,మే-19) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ఉండటంతో.. ఎమ్మెల్యేలను ఎలా తీసుకు వెళ్లాలన్నదానిపై మంతనాలు జరిపారు. రోడ్డు మార్గంలోనే ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికోసం స్పెషల్ బస్సులు సిద్ధం చేశారు.  కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు బయలుదేరారు.

రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నబలపరీక్షలో తామే గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు జేడీఎస్ ఎమ్మెల్యేలు. విశ్వాస పరీక్షలో నెగ్గాల్సినంత మెజార్టీ తమకుందన్నారు. బీజేపీ అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇక.. జేడీఎస్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఎక్కడికి పోలేదన్నారు  జేడీఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని చెప్పారు.

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్ధతివ్వకుండా తాము బలపరీక్ష ఎలా నెగ్గుతామని ప్రశ్నించారు సీఎం యడ్యూరప్ప. బలపరీక్షలో 101 శాతం తామే గెలుస్తామన్నారు. అటు ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో బిజీగా ఉంది బీజేపీ. బెంగళూరులో ఉన్న కేంద్రమంత్రి జేపీ నడ్డా యడ్యూరప్పతో భేటీ అయ్యారు. రేపటి అసెంబ్లీ సమావేశంలో భాగంగా .. బెంగళూరులోని షంగ్రీలా హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై జాతీయ నేతలు.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

Posted in Uncategorized

Latest Updates