కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర  

hanuman-jayanthiహనుమాన్ జయంతితో హైదరాబాద్ నగరానికి కొత్త శోభ వచ్చింది. వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. వేలల్లో  తరలివచ్చిన భక్తులతో నగర వీధులు కిక్కిరిశాయి. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు.

గౌలిగూడ రామమందిరంలో ప్రత్యేక పూజల తర్వాత వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది.  ఇందులో సౌండ్ సిస్టమ్స్ కి  అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు, భజరంగ్ దళ్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గౌలి గూడ రామందిర్ దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. భజరంగ్ దళ్ కార్యకర్తలకు పోలీసులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.  ఆ తర్వాత శోభాయాత్ర సాఫీగా సాగింది.

శోభాయాత్రలో పాల్గొన్న భజరంగ్ దళ్ జాతీయ ఉపాధ్యక్షుడు సోహంజి సోలంకి సంచలన కామెంట్స్ చేశారు. కుహనా సెక్యులరిస్టులతో దేశం ముక్కలైంది. హిందూ వ్యతిరేకులను ఏరివేస్తామన్నారు. ఆయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని చెప్పారు. బెంగాల్, కేరళ, కశ్మీర్ లో హిందూవాదులపై అణిచివేత జరుగుతోందన్నారు. శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కాషాయ జెండాలతో అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు.  బైక్ లతో వచ్చిన భక్తులు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.

యాత్ర సందర్భంగా పోలీసులు సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు లింకేజ్ చేశారు. గౌలీగూడ నుంచి తాడ్ బంద్ హనుమాన్ దేవాలయానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  అయినా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

మరోవైపు హనుమాన్ జయంతి వేడుకలు సిటీలో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదింటికే పూజలు ప్రారంభించిన అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన చేశారు. ఆలయాన్ని పళ్లు, పూలతో అందంగా అలంకరించారు నిర్వాహకులు.

సనత్ నగర్ స్వయంభూ ఆంజనేయస్వామి ఆలయంలోనూ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయం నుంచి స్వామి దర్శనానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates