కబడ్డీకి బాద్ షా సెలవు

 వెలుగు నెట్ వర్క్: కెప్టెన్‌‌ కూల్‌ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. కెప్టెన్‌‌గా, ఆటగాడిగా ఇండియన్‌‌ క్రికెట్‌ టీమ్‌ పై మహీది చెరగని ముద్రే. కానీ, మనకు మరో కెప్టెన్‌‌ కూల్‌ ఉన్నాడు. అది క్రికెట్‌ లో కాదు.. మనదైన.. మనసుకు నచ్చే ఆట కబడ్డీలో! అతనే ఇండియా కబడ్డీ టీమ్‌ మాజీ కెప్టెన్‌‌, ప్రొ కబడ్డీ లీగ్‌ స్టార్‌ అనూప్‌ కుమార్‌. ఆటలో వాడి తగ్గిందని గుర్తించి హుందాగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

క్రికెట్‌కి ధోనీలా కబడ్డీకి అనూప్‌ కూడా చాన్నాళ్లపాటు ఒక పిల్లర్‌ గా నిలిచాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా ఎంతోమంది యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారిన ఈ ‘కెప్టెన్‌ కూల్‌ ’ కూతకు సెలవు ఇచ్చేశాడు. ఆటలో చాలా ప్రశాంతంగా ఉండే ఈ స్టార్‌ రైడర్‌ వీడ్కోలు సమయంలో కూడా అంతే కూల్‌గా వ్యవహరించాడు. వయసు మీదపడుతుండగా.. తన ఆటలో వాడి తగ్గిందని గుర్తించిన కుమార్‌ హుందాగా తప్పుకున్నాడు. 15 సంవత్సరాల అతడి సుదీర్ఘ కెరీర్‌ ఎంతో మందికి స్పూర్తిదాయకం.

అన్న అల్టిమేటమ్‌ తో…
మన కబడ్డీ స్వర్ణ యుగంలో అనూప్‌ ది క్రియాశీలక పాత్ర. ప్రతిష్ఠాత్మక ఏషియన్‌ గేమ్స్‌‌లో ఆటగాడిగా రెండుసార్లు గోల్డ్‌‌ కొట్టాడు. కెప్టెన్‌ గా ఏకంగా వరల్డ్‌‌కప్‌ నే అందుకుని అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. కబడ్డీ రూపు రేఖలను మార్చేసిన ప్రొ కబడ్డీ లీగ్‌ లోనూ నాయకుడిగా ట్రోఫీ అందుకున్న అనూప్‌ కెరీర్‌ పరిపూర్ణమైనదనే చెప్పొచ్చు. చిన్నప్పుడు సరదాగా ఆడిన ఆట… తన జీవితాన్ని మారుస్తుందని, ఇంత పేరు ప్రఖ్యాతలు తెస్తుందని అతను ఊహించలేదు. అనూప్‌ అల్టిమేట్‌ ప్లేయర్‌గా ఎదగడం వెనకున్న కారణం… వాళ్ల అన్న. కొన్నేళ్ల కిందట అన్న జారీ చేసిన అల్టిమేటం అనూప్‌ ఎదుగుదలకు కారణమవడం విశేషం. హర్యానాలోని సాధారణ కుటుంబంలో పుట్టిన అనూప్‌ టీనేజ్‌లో తన వయసు కుర్రాళ్ల మాదిరిగానే కబడ్డీ ఆడడం మొదలెట్టాడు. అందరిలా సరదాగా ఆడి ఊరుకోకుండా ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. చదువును సైతం పక్కన బెట్టాడు. అనూప్‌ కు 17 ఏళ్ల వయసు ఉండగా ‘నీకు ఇంకో ఏడాది టైమ్‌‌ ఇస్తున్నా. స్పోర్ట్స్‌నే కెరీర్‌గా ఎంచుకుంటే నీ ఇష్టం. లేదంటే పై చదువులకైనా వెళ్లు, ఉద్యోగం చేసి ఫ్యామిలీకి అండగా ఉండు’ అని అతడి అన్న అల్టిమేటం జారీ చేశాడు. దాంతో, ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. అనూప్‌ దాని ద్వారానే ఉద్యోగం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటిదాకా కొన్ని టోర్నీలకు గైర్హాజరవుతూ వచ్చిన అనూప్‌ … లోకల్‌ గా జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గోదాలోకి దూకాడు. తన జట్టు తడబడినా గొప్పగా ఆడిన అనూప్‌ సీఆర్‌ పీఎఫ్‌ హెడ్‌ కోచ్‌ అమర్‌ సింగ్‌ యాదవ్‌ దృష్టిని ఆకర్షించాడు. అతడి సూచనతో సీఆర్‌ పీఎఫ్‌ ట్రయల్స్‌‌లో పాల్గొని 2005లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తర్వాత ఢిల్లీ జట్టుకు సెలెక్ట్‌‌ అయ్యాడు.

కూల్‌.. కూల్‌..
సహజ ప్రతిభ, డెడికేషన్‌ కలగలిసిన అనూప్‌ ఏడాదిలోపే నేషనల్‌ టీమ్‌‌కి ఎంపికయ్యాడు. 2006లో దక్షిణాసియా క్రీడల్లో అరంగేట్రం చేశాక వెనుదిరిగి చూసింది లేదు. చిన్న వయసులోనే నేషనల్‌ టీమ్‌‌లోకి రావడం, జట్టులో అప్పటికే కాకలుదీరిన ప్లేయర్లుండడంతో అనూప్‌ చాలా నెర్వస్‌గా ఫీలయ్యాడు. వారితో కలిసిపోవడానికి ఇబ్బంది పడ్డాడు. అయినా సరే, పట్టుదలగా అప్పటి స్టార్‌ కబడ్డీయన్లు రాకేశ్‌ కుమార్‌, దినేశ్‌, పంకజ్‌ షిర్సత్‌ వంటి మేటి ఆటగాళ్లకు దూరంగా ఉంటూ ట్రెయినింగ్‌ పైనే దృష్టి పెట్టాడు. కొన్ని క్యాంప్‌ల తర్వాత… ‘అరే కుర్రాడు బాగా కష్టపడుతున్నాడ’ని గ్రహించి సీనియర్లే అతడితో కలిసిపోయారట. దటీజ్‌ అనూప్‌. ఇలాంటి లక్షణాలే అతడిని ప్రత్యేకంగా నిలిపాయి. ఒత్తిడిలో మరింత స్ట్రాంగ్‌గా ఉండడం అతడికే సొంతం. అందుకే ఇంతింతై అన్నట్టుగా నేషనల్‌ టీమ్‌‌ను లీడ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. టీమ్‌‌ని నడిస్తున్నప్పుడు ఎంత ప్రెషర్‌ ఉన్నా సరే.. మ్యాట్‌ పై జెన్‌గా కనిపించి కెప్టెన్‌ కూల్‌ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌ )కి అద్భుత ఆరంభం లభించడంలో అనూప్‌ ది కూడా కీలక పాత్రే. ఇప్పుడైతే రాహుల్‌ చౌదరి, పర్‌ దీప్‌ నర్వాల్‌ , రోహిత్‌ , సిద్దా ర్థ్‌‌ లాం టి యువ కబడ్డీయన్ల హవా నడుస్తోంది కానీ.. అనూప్‌ వంటి సీనియర్‌ ప్లేయర్లు ఉన్నారన్న భరోసాతోనే నిర్వాహకులు పీకేఎల్‌ ను షురూ చేశారు. తొలి సీజన్‌ లోనే హరికేన్‌లా విజృంభించి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అనూప్‌ వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి ఐదు సీజన్లలో యు ముంబా జట్టుకి కెప్టెన్‌ గా ఉన్న అనూప్‌.. వరుసగా మూడు సీజన్లలో ఆ జట్టును ఫైనల్స్‌‌కి చేర్చాడు. రెండో సీజన్‌లో ట్రోఫీ అందుకున్నాడు. ఈ సీజన్‌లో జైపూర్‌ కెప్టెన్సీ స్వీకరించాడు. కెప్టెన్‌గా కూల్‌గా ఉండడమే కాదు, అంతే కూల్‌ గా పాయింట్లు రాబట్టడంలో అనూప్‌ కు సాటిలేరు. తన కాలును ముందుకు చాపుతూ టోస్‌ తో డిఫెండర్‌ పాదాలను తాకే ‘టో టచ్‌ ’లో అనూప్‌ మేటి. బోనస్‌ పాయింట్లు రాబట్టడంలోనూ అతడు స్పెషలిస్ట్‌‌. అందుకే అతడిని ‘బోనస్‌ కా బాద్‌ షా’ అంటారు. అతడు కబడ్డీకి కూడా బాద్‌షానే. ఆట నుంచి వైదొలిగినా..అభిమానుల గుండెల్లోంచి మాత్రం తప్పుకోలేడు.

Posted in Uncategorized

Latest Updates