కమనీయం: కన్నుల పండువగా రాములోరి కల్యాణం

bdrachalamరాష్ట్ర వ్యాప్తంగా  సీతారాముల  కల్యాణం  కమనీయంగా  జరిగింది. భద్రాద్రిలో  రాములోరి  కల్యాణోత్సవం  కన్నుల పండువగా  జరిగింది. వేద మంత్రాల  సాక్షిగా  రామయ్య.. సీతమ్మ  మెడలో  తాళి కట్టాడు.  ప్రభుత్వం తరపున  పట్టువస్త్రాలు, ముత్యాల  తంబ్రాలు సమర్పించారు.  వేలాదిగా  తరలివచ్చిన  జనంతో …మిథిలా  స్టేడియం  కిక్కిరిసిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. ఊరూరా, వాడవాడలా సీతారాముల కల్యాణం చూసి.. భక్తులు తరించారు. భద్రాద్రిలో రాములోరి కల్యాణం చూడముచ్చటగా జరిగింది. సంప్రదాయం ప్రకారం… అభిజిత్ లగ్నాన రామయ్య.. సీతమ్మ మెడల తాళి బొట్టు కట్టారు. సీతారాముల కళ్యాణానికి  ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మిథిలా స్టేడియంలో రాములోరి కల్యాణానికి … తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్టేడియం శ్రీరామ నామస్మరణతో మార్మోగింది.

మెదక్ ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. మెదక్ లోని కోదండరామాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో డిప్యూటీ స్పీకర్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకొడూరు మండలం చంద్లాపూర్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరాముడి దయతో వచ్చే ఏడాది వరకు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామన్నారు.

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దంపతులు, స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చుట్టపక్కగ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో  పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రామాలయాలు భక్తులతో కిటకిటలాయి. ఉదయం నుంచి రాములోరి దర్శనానికి భక్తులు క్యూలు కట్టారు.  జిల్లా కేంద్రంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో మంత్రి జోగు రామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో.. తెలంగాణ ప్రభుత్వంలోనూ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి జోగు రామన్న.

శ్రీరామ నవమి సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ధర్మారం, లక్సెట్టి పేట గుల్లకోటలో శ్రీ రామాంజనేయ ఆలయంలో పూజలు చేశారు. మంచిర్యాలలోని విశ్వనాథ  ఆలయం, గౌతమి నగర్ తో పాటు  బెల్లంపల్లిలోని  కోదండ రామాలయంలో  వివేక్ దంపతులు… ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత  మందమర్రిలోని  శ్రీ పంచముఖి  ఆంజనేయస్వామిని  దర్శించుకొని పూజలు చేశారు. ప్రజలంతా  సంతోషంగా ఉండాలని  రాములవారిని  మొక్కుకునట్లు చెప్పారు వివేక్ వెంకటస్వామి. మందమర్రి  ఆలయంలో  మాజీ మంత్రి  వినోద్  పాల్గొని సీతారాములకు  ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు గుల్లకోటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి 51 రకాల తలంబ్రాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.

కరీంనగర్ జిల్లాలోని ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కరీంనగర్ లోని ప్రసిద్ధ మహాశక్తి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవంలో కన్నుల పండువగా జరిగింది. ఆలయ పండితులు సాంప్రదాయ ప్రకారం కల్యాణం నిర్వహించారు.

వరంగల్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా.. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి అంకురార్పన, ధ్వజారోహణంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిజిత్ లఘ్న సమయంలో రామయ్యకు, సీతమ్మకు కల్యాణం నిర్వహించారు. హన్మకొండలోని వేయి స్తంబాల గుడిలో.. ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి.. కల్యాణ తంతు నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లాలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. అటూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లిలో రాములోరి పెండ్లి కన్నుల పండువగా జరిగింది. సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి.. సాంప్రదాయ ప్రకారం కల్యాణ తంతు నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates