కమలానికి కష్టమే…మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే అధికారమన్న సర్వే

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ఒపీనియన్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తోంది. రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ కి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని, రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి కావాలని అక్కడి ఓటర్లు కోరుకుంటున్నారని ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వేలో తెలిసింది.
ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 15 ఏళ్ల తరువాత తిరిగి కాంగ్రెస్‌ కి అధికారం దక్కనుంది. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత రాజస్ధాన్ సీఎం వసుంధర రాజే కన్నా సచిన్‌ పైలట్‌‌ వైపునకే అధిక మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.
200 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజస్థాన్‌ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 142, భాజపాకు 56 సీట్లు దక్కుతాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కి 49.9 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 34.3 శాతం ఓట్లు రానున్నట్లు తెలిపింది.
230 అసెంబ్లీ సీట్లు ఉన్న మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ కి 122 సీట్లు దక్కుతాయని, బీజేపీకి 108 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ కి 42.2 శాతం ఓట్లు, బీజేపీకి 41.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
90 అసెంబ్లీ సీట్లు ఉన్న ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ కి 47, బీజేపీకి 40 సీట్లు వస్తాయని తెలిపింది. మూడు సీట్లు ఇతరులకి రావచ్చు అని తెలిపింది. కాంగ్రెస్ కి 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు రానున్నాయని సర్వే తెలిపింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలకు శనివారం(అక్టోబర్-6) ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఛత్తీస్‌ గఢ్‌ లో రెండు దశల్లో నవంబర్-12, 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాంలో నవంబర్-28న ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌ తెలంగాణల్లో డిసెంబర్-7న ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్-11న ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి.

Posted in Uncategorized

Latest Updates