కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటన్న ఆయన్ను సీఎం పళనిస్వామి, శ్రీలంక్ష అధ్యక్షుడు సిరిసేన తరపు ప్రతినిధి, శరద్ పవార్ పరామర్శించారు. డీఎంకే శ్రేణులు, అభిమానులు కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. కరుణానిధికి కావేరి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. నాల్గురోజులుగా చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎంకు ప్రముఖుల పరామర్శలు కొనసాగుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రివర్గాలు, కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తరపున ఓ ప్రతినిధి కావేరి ఆస్పత్రిలో కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ… తమ అధ్యక్షుడు సిరిసేన పంపిన లేఖను స్టాలిన్ కు అందజేశారు శ్రీలంక ప్రతినిధి.

చెన్నై కావేరి ఆస్పత్రిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్టాలిన్, కనిమొళితో అడిగి తెలుసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని శరద్ పవార్ కు వివరించారు.

కరుణానిధి కోలుకుంటున్నారని తమిళనాడు సీఎం పళనిస్వామి చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి తిరిగొస్తారన్నారు. కరుణ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో… నిన్న రాత్రి పర్యటనలన్నీ అర్థంతరంగా రద్దు చేసుకున్నారు పళని. ఇవాళ ఉదయం కరుణానిధిని పరామర్శించారు సీఎం పళనిస్వామి.
డీఎంకే కార్యకర్తలు, ఆయన అభిమానులు కావేరి ఆస్పత్రి దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్లకార్డ్స్ పట్టుకుని ఆస్పత్రి ముందు పడిగాపులు కాస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని స్టాలిన్, కనిమొళి, రాజా విజ్ఞప్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates