కరెంటు రీఛార్జ్ కార్డులు వచ్చేస్తున్నాయ్ : 2019 నుంచి ప్రీపెయిడ్ మీటర్లు

ఢిల్లీ : మొబైల్స్ రీఛార్జ్, టీవీ DTHలకు ఎలా ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేస్తామో..ఇక నుంచి కరెంటు బిల్లుకు కూడా ఇదే ప్రీపెయిడ్ విధానం రానుంది. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి రానుండడంతో.. నెలనెలా కరెంటు బిల్లు కట్టాల్సిన పని తప్పుతుంది.

ఈసారి ఎంత బిల్లు వస్తుందోనని భయంగా ఎదురు చూడాల్సిన బాధ లేకుండా పోతుంది. అధిక మొత్తంలో వచ్చే కరెంటు బిల్లుల్ని అరికట్టడానికి కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకురానుంది.  ఏప్రిల్‌ 1, 2019 నుంచి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేలా ..కేంద్ర విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని తెలిపింది కేంద్రం. ఈ కొత్త రూల్ తో అనవసరంగా కరెంటు వాడకానికి చెక్ పడటంతో పాటు, పేదలకు మేలు చేకూరుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

వినియోగించిన దానికంటే అధికమొత్తంలో బిల్లు వస్తుందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు 2019, ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్ మీటర్లు  ఏర్పాటు చేసుకొనే అంశాన్ని తప్పనిసరి చేయనున్నామని  వెల్లడించింది. మొబైల్‌ ఫోన్‌ రీఛార్జి కార్డులలాగా.. ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ రీఛార్జి కార్డులు తీసుకురానున్నామని తెలిపింది. త్వరలోనే మీటర్ నంబర్ పై ఆన్ లైన్ లోనూ రీఛార్జ్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తామని తెలిపింది కేంద్ర విద్యుత్ శాఖ.

 

Posted in Uncategorized

Latest Updates