కరోనాపై పోరులో లీడర్లు ప్రజలే

న్యూఢిల్లీ‘‘కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. ఈ పోరులో ప్రతి పౌరుడు ఓ సైనికుడే. మనమందరం కొవిడ్ వారియర్స్ కావచ్చు. ఈ మహమ్మారిపై ఒక్కటిగా పోరాడవచ్చు” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భవిష్యత్​లో కరోనా గురించిన చర్చ ఎక్కడైనా జరిగితే.. ఇండియాలో ప్రజలు చేసిన పోరాటం గురించి తప్పక మాట్లాడుతారని చెప్పారు. ప్రస్తుతం మనం యుద్ధం మధ్యలో ఉన్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆదివారం నిర్వహించిన మన్​కీ బాత్​లో సుమారు 30 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడారు. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్​ను కొనసాగించాలని కోరారు. ‘దో గజ్ దూరి.. బహుత్ హై జరూరి(రెండు గజాల దూరం.. చాలా ముఖ్యం)’ అన్నారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు

‘‘ఓవర్ కాన్ఫిడెంట్​గా ఉండొద్దని ప్రజలను కోరుతున్నా. అత్యుత్సాహం కూడా వద్దు. మీ సిటీ, మీ గ్రామం, మీ వీధి లేదా ఆఫీసు వరకు కరోనా రాదనుకోవద్దు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు మనకు చాలా చెబుతున్నాయి” అని అన్నారు. ఈ సందర్భంగా ‘సావ్ధాని హతి, దుర్ఘటన ఘతి’ (జాగ్రత్త తగ్గినప్పుడే.. ప్రమాదం జరుగుతుంది) అనే హిందీ ఇడియమ్ ను మోడీ ప్రస్తావించారు.

మీది మహాయజ్ఞం

కరోనాను అడ్డుకోవడంలో రాష్ట్రాలు, ఎమర్జెన్సీ వర్క ర్లు, సివిల్ సొసైటీ గ్రూపులు చేస్తున్న సేవలను మోడీ కొనియాడారు. దేశ ప్రజల సంకల్పం.. వ్యాపారాలు, ఆఫీసులు, విద్యాసంస్థలు, వైద్య రంగాల్లో కొత్త మార్పులకు వేగంగా దారి చూపిందని అన్నారు. ఆహారం, మందులతో పేదలకు సాయం చేస్తున్న ప్రజలను ప్రశంసించారు. వారి పనిని ‘మహాయజ్ఞం’తో పోల్చారు. మాస్కులు వేసుకోవడం సొసైటీలో భాగమైపోయిందని మోడీ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మానేయాలని ప్రజలను కోరారు.

ఇండ్లలోనే పండుగలు

ప్రజలకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. రంజాన్ మాసం ప్రారంభమైన సంగతిని గుర్తుచేశారు. ఈద్ నాటికి ప్రపంచం కరోనా నుంచి విముక్తి పొందాలని ప్రార్థిద్దామన్నారు.  ఇప్పుడు ఇండ్లలోనే వేడుకులు జరుపుకుంటున్నారని అన్నారు.

అప్పుడు యోగా.. ఇప్పుడు ఆయుర్వేదం

యోగా తర్వాత.. ఇప్పుడు ఆయుర్వేద సూత్రాలను కూడా ప్రపంచం అంగీకరిస్తుందని మోడీ అన్నారు. గతంలో ప్రపంచ దేశాలు యోగాను సంతోషంగా అంగీకరించాయని, ఇప్పుడు ఆయుర్వేదాన్ని యాక్సెప్ట్ చేస్తాయని చెప్పారు. ఆయుర్వేదం గురించి ప్రపంచ దేశాలకు సైంటిఫిక్​గా వివరించే బాధ్యతలను యువత తీసుకోవాలని సూచించారు. ‘‘దేశ ప్రజలు మన సొంత బలాలను, అద్భుత సంప్రదాయాలను అంగీకరించడం లేదు. ఇది దురదృష్టకరం. అదే వేరే ఏదైనా దేశం ఇవే విషయాలను రీసెర్చ్ చేసి, మన సొంత ఫార్ములాలను మనకే చెబితే మాత్రం ఒప్పుకుంటారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తలవంచి నమస్కరిస్తున్నా

అగ్ని, అప్పు, అనారోగ్యాన్ని.. ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. వాటి నుంచి కలిగే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి.. పూర్తిగా బయటపడ టం చాలా ముఖ్యం. అత్యుత్సాహం లేదా నిర్లక్ష్యం ఉండొద్దు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ యుద్ధంలో ప్రతిఒక్కరూ తమ కెపాసిటీ, ఎబిలిటీ బట్టి పోరాడుతున్నారు. కొందరు తమ పెన్షన్‌ను విరాళమిస్తున్నారు. రైతులు కూరగాయల ఉత్పత్తులను ఫ్రీగా ఇస్తున్నారు. కొంతమంది ఫేస్‌ మాస్క్‌ లు చేసిస్తున్నారు. స్కూలు లో క్వారంటైన్​లో ఉన్నందుకు కొందరు.. ఆ స్కూల్​కు రంగులేశారు. అందరికీ నా తల వంచి నమస్కరిస్తున్నా.

– ప్రధాని నరేంద్ర మోడీ

నేడు సీఎంలతో  వీడియో కాన్ఫరెన్స్

రాష్ర్టాల ముఖ్యమంత్రులతో మోడీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్​డౌన్ సడలింపులపై సీఎంలతో ఆయన చర్చిస్తారు. మే 3 తర్వాత లాక్​డౌన్​నుంచి దశలవారీగా ఎగ్జిట్ అయ్యే అంశంపైనా చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Latest Updates