కర్నూల్ లో ఘోరం : పొలాల్లో నాటుబాంబు పేలి ముగ్గురు మృతి

ఏపీ కర్నూలు నగరంలో ఘోరం జరిగింది. నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో నాటు బాంబు పేలి ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు. మృతులు జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ , జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎన్నో బిల్డింగులు కట్టించారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కర్నూలు శివారులో 20 కోట్ల విలువైన భూమిని కొన్నారు. దీనికి సంబంధించి ఇవాళ పొలాన్ని సర్వే చేయించారు. ఇందుకోసం వరుసకు సోదరుడయ్యే ASI జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్ మెంట్ డ్రైవర్ సుధాకర్ అక్కడికి వచ్చారు. భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఒక దగ్గర పోగుచేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్ అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాసులు, సుధాకర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. కర్నూలు డీఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ బాంబులను దాచారా…? లేదంటే కావాలనే దాడి జరిగిందా…? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు డీఎస్పీ. బాంబు పేలుడు ఘటన కర్నూలు టౌన్లో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న జంపాల కుటుంబసభ్యులు, బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జంపాల కుటుంబ సభ్యులు అందరితోనూ మంచిగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి హాస్పిటల్లో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

Posted in Uncategorized

Latest Updates