కల్వకుర్తి ప్రాజెక్టుతో నాగర్ కర్నూల్ కి ఎక్కువ లబ్ది : హరీశ్

HARISH60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మెదక్ లో ఒక్క ఎకరానికి నీరు ఇచ్చిందిలేదన్నారు మంత్రి హరీశ్. ఆదివారం (మార్చి-25) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసుదనాచారి శాసనసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంను చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గ ఇరిగేషన్ సమస్యలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా పనులు చేయాలని ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి కానీ..మన దగ్గర కాంగ్రెస్ మంచి పనులను అడ్డుకుంటుందన్నారు. వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టులను పూర్తిచేసి, సాగుకు నీరందిస్తామన్నారు. బ్యాలెన్స్ రిజర్వాయర్ విషయంలో అసెంబ్లీ తర్వాత చర్చిస్తామన్నారు మంత్రి హరీశ్.

నాగర్‌కర్నూల్ జిల్లాలో మార్చి నెలలో కూడా చెరువులు మత్తడి పోస్తున్నాయని తెలిపారు హరీశ్. అచ్చంపేట నియోజకవర్గంలోని చంద్రసాగర్ కాల్వను తవ్వాలన్న ప్రతిపాదన ఉందన్నారు. చంద్రసాగర్ లిఫ్ట్ పెట్టి అమ్రాబాద్‌కు నీళ్లు ఇస్తాం. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించే విషయం పరిశీల్తిన్నామని తెలిపారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్ తుది దశలో ఉందన్నారు. ఉప్పునూతల, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో వీలైనచోట్ల చెక్ డ్యామ్‌ల ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపిన హరీశ్.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు.

జల విజయయాత్ర పేరిట మర్రి జనార్ధన్‌రెడ్డి పాదయాత్ర చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఆయన కృషి ఎనలేనిది అని తెలిపారు. మార్చిలోనూ నాగర్‌కర్నూల్ జిల్లాలో చెరువులు మత్తడి దుంకుతున్నాయని.. TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి కొదవలేదని రైతులు అంటున్నారని మంత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టు కింద అందోల్, పుల్కల్ మండలాల్లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపిన మంత్రి.. పటాన్‌చెరు, ఆర్‌సీపురం పరిధిలో ఉండే కూలీలు 750 మంది మళ్లీ తమ సొంత గ్రామాలకు వచ్చి ఇక్కడే రేషన్‌కార్డులు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో వలసపోయిన ప్రజలు వాపస్ వస్తున్నారని.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే కిషన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని మంత్రి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులు, ట్రిబ్యునళ్లలో పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates