కల చెదిరింది : పేద స్టూడెంట్ ప్రాణం తీసిన బైక్ ఫొటోగ్రఫీ

బైక్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. కొత్తగా వచ్చిన బైక్ లపై చక్కర్లు కొట్టడం అంటే సరదా ఆ యువకుడికి. నిరుపేద కుటుంబం కావడంతో ఖరీదైన బైకు కలగానే ఉంది. ఎలాగైనా డబ్బు సంపాదించి, న్యూమోడల్ బైక్ తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఫ్రెండ్ తో బైక్ ఫోటోగ్రఫీ ఈవెంట్ పేరుతో వ్యాపారం చేయాలనుకున్నాడు. అదికాస్త బెడిసికొట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ జీడిమెట్ల గాంధీనగర్‌ లో నివసించే వంశీకృష్ణ సాయి డిగ్రీ చదువుతున్నాడు. తండ్రిది ఫ్రాబ్రికేషన్ వర్క్ షాపు. వంశీకి కొత్త కొత్త బైక్‌ లంటే చాలా ఇష్టం. తాను కొత్త బైక్‌ లు కొనలేడు. సో.. బైక్‌ లను అద్దెకు ఇస్తూ ఫొటోలు తీసి ఇచ్చే శ్యామ్ అనే వ్యక్తితో స్నేహం చేశాడు. ఇద్దరు మరికొందర్ని కలుపుకుని బైక్ ఫోటోగ్రఫి అనే ఈవెంట్‌ ప్లాన్ చేశారు. కూకట్‌ పల్లి IDL చెరువు దగ్గర జూలై 29వ తేదీ బైక్ ఫోటోగ్రఫి ఈవెంట్ నిర్వహించారు. ఇలా వచ్చి బైకుల మీద రైడ్ చేసి.. ఫొటో తీసుకోవాలంటే ఒకొక్కరు రూ.400 చెల్లించాలని ప్రచారం చేశారు. శ్యామ్ మరికొందరు కలిసి కెమెరాలు, బైకులు తీసుకుని రాగా, వంశీ ఈవెంట్‌కు 400 మంది విద్యార్ధులను తీసుకుని వస్తానని ప్రామిస్ చేశాడు. వంశీ అంచనా ఇక్కడ తప్పింది. వంశీ తరఫున 60 మంది మాత్రమే వచ్చారు. దీంతో ఈవెంట్ నిర్వహణతో నష్టం వచ్చింది.

ఆ నష్టాన్ని నువ్వే భరించాలంటూ వంశీకి తెగేసి చెప్పాడు ఫ్రెండ్ శ్యామ్. లక్షన్నర రూపాయలు నష్టం అని తేల్చాడు. విషయం ఇంట్లో తెలిస్తే కష్టం అని భావించిన వంశీ.. ఆ డబ్బు చెల్లించలేక ఆదివారం (జూలై-29) రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ వేధింపుల వల్లే తమ కుమారుడు మరణించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశారు వంశీ తల్లితండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates