కష్టపడినా సీటివ్వలేదన్న కొండా సురేఖ.. టీఆర్ఎస్ కౌంటర్

హైదరాబాద్ : బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా TRS కోసం ఎంతో చేశానని.. అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ. దీనికి సంబంధించి  TRS అధినేత కేసీఆర్‌కు కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ మాట్లాడారు. అధికారం కోసం, స్వలాభం కోసం పార్టీలు మారిన చరిత్ర తనది కాదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదన్నారు. టికెట్ కేటాయించడంపై  కేసీఆర్ కు లేఖ రాసినా… దానిపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వక పోవడం… మహిళలపై ఆయనకు ఉన్న గౌరవం ఎలాంటిదో తెలుపుతోందన్నారు. కొండా మురళి సహా మా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చాలా పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని… అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో నాలుగైదు రోజుల్లో మా కార్యాచర్యణను తెలియజేస్తామన్నారు కొండా సురేఖ.

మరోవైపు కొండాదంప‌తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేత విన‌య్ భాస్క‌ర్. పిచ్చి పట్టి మాట్లాడుతున్నారన్నారు. కొండా దంపతులకు TRS రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిందన్నారు. కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వకపోవడంతో వరంగల్‌ ఈస్ట్‌ లో ప్రజలు పండుగ చేసుకుంటున్నారని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు కొండ‌ దంపతులు కేరాఫ్ అని అన్నారు. పదవుల కోసం పార్టీ మారే అలవాటు కొండా దంపతులకు ఉందని మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ పార్టీలో చీలికలేదని… కార్యకర్తలు ఇపుడు హ్యాపీగా ఉన్నారని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates