కష్టపడి డబ్బులు కొట్టేస్తే… గాలి వచ్చి మొత్తం పట్టుకెళ్లింది

AIRప్రతి గింజ మీద దాన్ని తినే వాళ్ల పేరు రాసి ఉంటుందన్నట్లు ప్రతి నోటు మీద దాన్ని ఖర్చుపెట్టే వాళ్ల పేరు రాసి ఉంటుంది కాబోలు. అందుకే చాలా కష్టపడి కొట్టేసిన డబ్బులను ఖర్చు పెట్టే భాగ్యం మాత్రం ఆ దొంగలకు లభించలేదు. దురదృష్టం 100 కిలోమీటర్ల స్పీడ్‌ తో వారిని వెంటాడి.. కళ్ల ఎదుటే కొట్టేసిన డబ్బు గాల్లో కి ఎగిరిపోవడంతో షాక్ అయ్యారు.
నార్త్ వెస్ట్ ఇంగ్లండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ సిటీ పరిధిలోని డ్రోయిల్స్‌డెన్‌ లో ఉన్న ఓ ట్రావెల్ ఏజెన్సీలోకి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు దూరారు. సిబ్బందిని బెదిరించి వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు లాక్కున్నారు. ఆ డబ్బులను ప్యాంట్‌లో పెట్టుకొని బయటికి వచ్చారు. బయటకు రాగానే గాలి బీభత్సం సృష్టించడంతో ప్యాంట్‌లో దాచిన డబ్బులన్నీ గాలికి ఎగిరి రోడ్డుమీద పడిపోయాయి. డబ్బులన్నీ రోడ్డుపై పడిపోగానే ఓ దొంగ అక్కడి నుంచి పారిపోగా… మరో దొంగ మాత్రం ఆ డబ్బులను ఏరడానికి ప్రయత్నించాడు. అయితే అంతలోనే ప్యాంట్‌ లో ఉన్న మరికొన్ని నోట్లు కూడా గాలికి ఎగిరిపోయాయి. మార్చి 17, 2018 న జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితులను పట్టుకునేందుకు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates