కసాయి కొడుకు : తనపై మంత్రాలు వేస్తోందని తల్లిని చంపేశాడు

వేములవాడ : తనపై మంత్రాలు చేస్తుందన్న అనుమానంతో కన్నతల్లిని దారుణంగా చంపేశాడు. బల్లపై నుంచి కిందపడి చనిపోయిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు కొడుకు. పొంతనలేని సమాధానలు చెప్పడంతో కొడుకుపై అనుమానించిన పోలీసులు.. గట్టిగా అడుగగా నిజం ఒప్పుకున్నాడు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా, బోయినపల్లిలో జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, విలాసాగర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, చంద్రవ్వ(60) దంపతులకు కుమారుడు శ్రీనివాస్‌, ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాస్‌(30)కు వివాహమైంది. కరీంనగర్‌ జిల్లా గంగాధరలో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అనారోగ్యం కారణంగా ఆర్నెల్ల క్రితం తిరిగొచ్చాడు. తల్లి  మంత్రాలు వేయడం వల్లనే తాను అనారోగ్యానికి గురవుతున్నట్టు అనుమానిస్తున్న శ్రీనివాస్‌, ఇటీవల విలాసాగర్‌ లోని తన ఇంట్లో విరుగుడు పూజలు చేయించాడు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో MRI  పరీక్షలు చేయించుకున్నాడు.

ఏ లోపం లేదని రిపోర్ట్ రావడంతో.. ఇదంతా తల్లి చేసే మంత్రాల ప్రభావమేనని నమ్మాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. బల్లపై నుంచి కింద పడి అమ్మ చనిపోయిందంటూ  తండ్రి నర్సయ్యకు సమాచారమిచ్చాడు. అనుమానాస్పదంగా వృద్ధురాలు చనిపోయిందని సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొడుకు శ్రీనివాస్ ను నిలదీయడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌ ను అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates